Share News

ధరలు దారుణం

ABN , Publish Date - Nov 01 , 2026 | 02:54 AM

అత్యంత నాణ్యమైన పొగాకుకు కూడా కనీసం లోగ్రేడ్‌లకు ఇచ్చే ధర కూడా ఇవ్వకుండా వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారని పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోల్డ్‌స్టోరేజీ లలో నిల్వ ఉంచిన అత్యంత నాణ్యమైన పొగాకును ప్రస్తుతం వేలంకు తీసుకొ స్తుండగా ధరలు దిగ్గోస్తున్నారని వాపోతున్నారు.

ధరలు దారుణం
కందుకూరులో ధర్నా చేస్తున్న రైతులు

నాణ్యమైన పొగాకుకు అంతంతమాత్రమేనా!

కందుకూరులో వేలాన్ని అడ్డుకున్న రైతులు

అక్కడ రోడ్డుపై బైఠాయించి ధర్నా

కందుకూరు, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : అత్యంత నాణ్యమైన పొగాకుకు కూడా కనీసం లోగ్రేడ్‌లకు ఇచ్చే ధర కూడా ఇవ్వకుండా వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారని పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోల్డ్‌స్టోరేజీ లలో నిల్వ ఉంచిన అత్యంత నాణ్యమైన పొగాకును ప్రస్తుతం వేలంకు తీసుకొ స్తుండగా ధరలు దిగ్గోస్తున్నారని వాపోతున్నారు. వ్యాపారుల తీరును నిరసి స్తూ కందుకూరు-2 వేలం కేంద్రంలో శనివారం రైతులు కొనుగోళ్లను అడ్డుకు న్నారు. నలదలపూరు, మోపాడు క్లస్టర్‌ల నుంచి శనివారం బేళ్లను వేలానికి రప్పించగా కొద్దిసేపు కొనుగోళ్లు కొనసాగిన తర్వాత రైతులు ఆందోళనకు దిగారు. వేలం కేంద్రంలో వ్యాపారుల దోపిడీకి అడ్డులేకుండాపోయిందన్నారు. బోర్డు అధికారులు కూడా పరిస్థితి బాగాలేదు, సర్దుకుపొమ్మనమంటూ తమకు సలహా ఇస్తున్నారని మండిపడ్డారు. శనివారం తెప్పించిన బేళ్లలో 20శాతం మేర అమ్మకాలు జరిగాక రైతులు ఆందోళనకు దిగడంతో వేలాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం పొగాకు రైతులు, రైతుసంఘాల నాయకులు నేతి మహేశ్వరరావు, బి.సురేష్‌బాబు తదితరుల ఆధ్వర్యంలో వేలంకేంద్రం వెలుపల రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతుసంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ ఏడాది పండించిన పంటలోనే అత్యంత నాణ్యమైన పొగాకును కోల్డ్‌ స్టోరేజీలలో నిల్వ చేశామన్నారు. ప్రస్తుతం ఆ బేళ్లను కోల్డ్‌స్టోరేజీల నుంచి తెచ్చి వేలంలో పెడుతుండగా దారుణమైన ధరలు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటాకు రూ.15వేలు నుంచి రూ.16వేలలోపే అంతటి నాణ్యమైన పొగాకును కొనుగోలు చేస్తుండటం వారి దోపిడీకి నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ఈ సీజన్‌లో అత్యధిక ధర క్వింటా రూ.26వేలు పలుకగా దానికి సంతృప్తి చెందకుండా తాము ఈ పొగాకును కోల్డ్‌ స్టోరేజీలలో నిల్వ చేశామని రైతులు తెలిపారు. చివర్లో కనీసం క్వింటాకు మూడు నాలుగు వేల ధర పెరిగినా ఖర్చులు పోను రూ.2వేలు అయినా లాభం దక్కుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నామని తెలిపారు. అయితే ప్రస్తుతం ధర పెరగడం మాట అటుంచి మొదట్లో లభించిన ధర కన్నా క్వింటాకు రూ.10వేలు కోత పెట్టి కొనుగోలు చేస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితిగా ఉందన్నారు. లోగ్రేడ్‌ పొగాకుకు ఇచ్చేధర కూడా అత్యంత నాణ్యమైన పొగాకుకు ఇవ్వడం లేదంటే ఇది కేవలం రైతులు ఏమీ చేయలేరు, మనం ఎలా దోచుకున్నా సరిపోతుందన్న ఆలోచన తప్ప మరొకటి కాదని ఆగ్రహించారు. వ్యాపారులకు డిమాండ్‌ లేనప్పుడు కనీసం ఈ ఏడాది అమలుచేసిన ప్రామాణిక ధర అయినా ఇవ్వాలి కదా అని వాపోయారు. ఆ ధర కూడా ఇవ్వనప్పుడు బోర్డు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వ్యాపారులతో మాట్లాడటం ద్వారా రైతులకు న్యాయం చేయాలి కదా అని రైతుసంఘాల నాయకులు ప్రశ్నించారు. సోమవారం బోర్డు ఉన్నతాధికారులను పిలిపిస్తామని వారి సమక్షంలోనే రైతులు, వ్యాపారులతో చర్చించి మీకు న్యాయం జరిగేందుకు కృషిచేస్తామని వేలం నిర్వహణాధికారి ఏ.శ్రీనివాసులు హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు.

Updated Date - Nov 01 , 2026 | 02:54 AM