రాజముద్రతో సిద్ధం
ABN , Publish Date - Jan 02 , 2026 | 01:26 AM
జిల్లాలోని రైతులకు శుక్రవారం నుంచి పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రీసర్వేను ఇష్టారీతిన చేయడంతోపాటు రైతులకు ఇచ్చిన పాసుపుస్తకాల్లో అప్పటి సీఎం జగన్ బొమ్మను ముద్రించారు.
నేటి నుంచి పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
రీసర్వే చేసిన గ్రామాల వారీగా ఇచ్చేందుకు చర్యలు
9వతేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమం
జిల్లావ్యాప్తంగా 72 వేల పుస్తకాలు రెడీ
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని రైతులకు శుక్రవారం నుంచి పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రీసర్వేను ఇష్టారీతిన చేయడంతోపాటు రైతులకు ఇచ్చిన పాసుపుస్తకాల్లో అప్పటి సీఎం జగన్ బొమ్మను ముద్రించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పాసుపుస్తకాలను తొలగించి ప్రభుత్వ చిహ్నమైన రాజముద్రతో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంది. జిల్లాలో రీసర్వే జరిగిన గ్రామాల్లో 72,000 పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందించనున్నారు. అందుకోసం శుక్రవారం నుంచి ఈనెల 9వతేదీ వరకు గ్రామాల వారీగా ప్రణాళికలు రూపొందించి సభలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ సభలకు ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించాలని సూచించడంతో తదనుగుణంగా జిల్లా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. శుక్రవారం కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం వెల్లటూరులో జరిగే కార్యక్రమంలో మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, కలెక్టర్ రాజాబాబు పాల్గొననున్నారు. అనంతరం మంత్రి కనిగిరిలో పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తారు. ఇతర ప్రాంతాల్లో ఆర్డీవోలు, తహసీల్దార్ల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించున్నారు.