Share News

చర్యలకు సిద్ధం

ABN , Publish Date - Jan 22 , 2026 | 02:50 AM

ఉమ్మడి జిల్లాలో ఇంటిపన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసు కునేందుకు పంచాయతీ అధికారులు సిద్ధమయ్యారు.

 చర్యలకు సిద్ధం

ఇంటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంపై సీరియస్‌

ముగ్గురు డిప్యూటీ ఎంపీడీవోలు, 17 మంది పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు

వారంలో మెరుగుపడకపోతే తదుపరి చర్యలు

హెచ్చరించిన డీపీవో వెంకటేశ్వరరావు

ఒంగోలు కలెక్టరేట్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో ఇంటిపన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసు కునేందుకు పంచాయతీ అధికారులు సిద్ధమయ్యారు. 2025-26 ఆర్థిక సంవ త్సరానికి సంబంధించిన ఇంటి పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పదిరోజుల క్రితం 135మంది పంచాయతీ కార్యదర్శులు, 17 మంది డిప్యూటీ ఎంపీడీవోలకు నోటీసులు ఇచ్చారు. వెంటనే కారణాలు చెప్పాలంటూ ఆ నోటీసు ల్లో పేర్కొన్నాయి. అయితే పదిరోజుల్లో 120 పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్లలో కొంత మేర పురోగతి సాధించారు. ముగ్గురు డిప్యూటీ ఎంపీడీవోలు, మరో 17 పంచాయతీల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆ కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని బుధవారం జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వరరావు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు.

వారంలోగా వివరణ ఇవ్వాలి

సీఎస్‌పురం మండలం కోవిలంపాడులో కేవలం 0.90శాతం మాత్రమే ఇంటి పన్నులు వసూలు చేయగా మిగిలిన పంచాయతీల్లో ఒక శాతం నుంచి మూడు శాతం వరకు మాత్రమే పన్నులు వసూలు చేశారు. ఇంటిపన్నుల వసూళ్లలో పంచాయతీ కార్యదర్శులను సమన్వయం చేసుకొని పన్నులు సకాలంలో వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన ముగ్గురు డిప్యూటీ ఎంపీడీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారికి కూడా నోటీసులు ఇచ్చారు. సీఎస్‌పురం. గజ్జలకొండ, పెద్దారవీడు ఎంపీడీవోలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. కోవిలంపాడు, పుల్లగురపల్లి, వెంకటాపురం, మైలవరం, ఉప్పుమాగులూరు, ఒమ్మెవరం, పోలేపల్లి, లక్కవరం, బొద్దికూరపాడు, తిమ్మనపాలెం, ఈవీపాలెం, గాడిపర్తివారిపాలెం, పెద్దకండ్లగుంట, జేసీఅగ్రహారం, పోలవరం, పుచ్చకాయలపల్లి, తంగిరాలపల్లి, వెల్లలచెరువు పంచాయతీ కార్యదర్శులకు ఈ నోటీసులు ఇచ్చారు. వారంరోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో ఆదేశించారు. ఇంకొకవైపు ఇంటి పన్నుల వసూళ్లు మెరుగుపడకపోతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తప్పవని ఆ నోటీసుల్లో డీపీవో హెచ్చరించారు.

Updated Date - Jan 22 , 2026 | 02:50 AM