పొగాకు కొనుగోళ్లకు సన్నాహాలు
ABN , Publish Date - Feb 22 , 2026 | 02:31 AM
ప్రస్తుత సీజన్ పొగాకు కొనుగోళ్లపై బోర్డు ఉన్నతాధికారులు ఎట్టకేలకు దృష్టిసారించారు. గతంకన్నా ఈ ఏడాది వేలం జాప్యమయ్యే అవకాశాలు, దీంతో రైతులకు జరగనున్న నష్టంపై ‘ఆంధ్ర జ్యోతి’లో ప్రచురితమైన వరుస కథనాలతో వారు కదిలారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో అధికారుల్లో కదలిక
దక్షిణాది ప్రాంత రైతు ప్రతినిధులతో బోర్డు సెక్రటరీ, ఆర్‌ఎంల భేటీ
వేలం ప్రారంభంపై అభిప్రాయ సేకరణ
త్వరలో వ్యాపారులతోనూ సమావేశం
అనధికార అమ్మకాలు చేయరాదని హెచ్చరిక
కర్ణాటక మార్కెట్ పరిస్థితిపైనా వివరణ
ఒంగోలు, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుత సీజన్ పొగాకు కొనుగోళ్లపై బోర్డు ఉన్నతాధికారులు ఎట్టకేలకు దృష్టిసారించారు. గతంకన్నా ఈ ఏడాది వేలం జాప్యమయ్యే అవకాశాలు, దీంతో రైతులకు జరగనున్న నష్టంపై ‘ఆంధ్ర జ్యోతి’లో ప్రచురితమైన వరుస కథనాలతో వారు కదిలారు. ఒంగోలు కేంద్రంగా ఉన్న దక్షిణాది రీజియన్ల పరిధిలోని ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం జిల్లాల్లో ఉన్న 11 వేలం కేంద్రాల రైతు ప్రతినిధులతో శనివారం స్థానిక ప్రాంతీయ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. బోర్డు సెక్రటరీ దివి వేణుగోపాల్, ఒంగోలు ఆర్‌ఎం శీలం రామారావు పాల్గొన్నారు. రాష్ట్రంలో వేలం ప్రారంభించేందుకు పొగాకు బోర్డు తీసుకుంటున్న చర్యలను తొలుత వివరించారు. అనంతరం రైతు ప్రతినిధుల అభిప్రాయాలను అడిగి తెలుసుకు న్నారు. ఆయా వేలం కేంద్రాల నుంచి హాజరైన రైతు ప్రతినిధులలో ఎక్కువ మంది ప్రస్తుత సీజన్‌లో పంట ఉత్పత్తికి ఎదుర్కొన్న ఇబ్బందులు, రైతుల ఆర్థిక అవసరాలు, అనధికారికంగా జరుగుతున్న కొనుగోళ్లు, ఇతరత్రా పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల్లో వచ్చే నెల తొలిరోజుల్లో కాకపోయినా నెలాఖరుకు అయినా వేలం ప్రారంభించాలని కోరినట్లు సమాచారం. దానిని పరిగణనలోకి తీసుకున్న బోర్డు అధికారులు త్వరలో వ్యాపార ప్రతినిధులతో కూడా ఉన్నత స్థాయిలో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని రైతు ప్రతినిధులకు తెలిపారు. ప్రతివేలం కేంద్రం స్థాయిలోనూ సమావేశాలను నిర్వహించి ఏప్రాంతంలో ఎప్పుడు కొనుగోళ్లను ప్రారంభించాలన్న దానిపై స్థానిక రైతుల అభిప్రాయాలను స్వీకరించి బోర్డు ప్రధాన కార్యాలయానికి నివేదించాలని వేలం కేంద్ర అధికారులను బోర్డు సెక్రటరీ వేణుగోపాల్ ఈ సందర్భంగా ఆదేశించారు. ఇదిలాఉండగా వేలం ప్రారంభించక ముందే అనధికారిక కొనుగోళ్లు జరుగుతున్న వ్యవహారంపై కూడా బోర్డు సెక్రటరీ ఈ సమావేశంలో స్పందించారు. దళారుల మాటలకు ఆశపడి రైతులు ఎవరూ పొగాకును బయట అమ్ముకోవద్దని సూచించారు. అలాంటి కొనుగోళ్లు, అమ్మకాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పెద్దసంఖ్యలో పొగాకు బేళ్లను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తున్న రైతులు విధిగా వేలం కేంద్రాల క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి అనుమతి పత్రాలు పొందాలని స్పష్టం చేశారు.