Share News

తిరుగు ప్రయాణంలోనూ తిప్పలు!

ABN , Publish Date - Jan 18 , 2026 | 02:50 AM

సంక్రాంతి ప్రభావంతో రవాణా వ్యవస్థలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.పండుగకు సొంతర్లకు వచ్చి ఆనందంగా గడిపి ఉద్యోగ, ఉపాధి, చదువుల నిమిత్తం తిరిగి నగరాలకు వెళ్లేందుకు సిద్ధమైన వారికి ప్రయాణ కష్టాలు ఎదురవుతున్నాయి.

తిరుగు ప్రయాణంలోనూ తిప్పలు!
ఒంగోలులో ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు పోటీ పడుతున్న ప్రయాణికులు

పండుగ ప్రభావంతో డిమాండ్‌

కిటకిటలాడుతున్న బస్సులు, రైళ్లు

దూరప్రాంతాల వారికి ప్రయాణ కష్టాలు

ఒంగోలు కార్పొరేషన్‌, జనవరి 17(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి ప్రభావంతో రవాణా వ్యవస్థలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.పండుగకు సొంతర్లకు వచ్చి ఆనందంగా గడిపి ఉద్యోగ, ఉపాధి, చదువుల నిమిత్తం తిరిగి నగరాలకు వెళ్లేందుకు సిద్ధమైన వారికి ప్రయాణ కష్టాలు ఎదురవుతున్నాయి. రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు రవాణా సౌకర్యాలన్నింటిలో రిజర్వేషన్‌ నిల్‌... బోర్డులు దర్శనమిస్తున్నాయి. పిల్లా పాపలతో ప్రయాణం చేయాల్సి ఉండటంతో రిజర్వేషన్‌ల కోసం పాట్లు పడినా ఆదివారం వరకు లభించే పరిస్థితి లేదు. దీంతో గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందరూ ఒక్కసారే పల్లెల నుంచి పట్టణాలకు పయనం కావడంతో ప్రధాన రహదారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. గ్రామాలు బోసిపోతున్నాయి. పల్లెల నుంచి పట్టణాలకు ప్రయాణించేందుకు జిల్లాలో అధికశాతం ఆర్టీసీనే ఆధారం కావడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. పండుగ సందర్భంగా ఆర్టీసీ యంత్రాంగం కొన్ని ప్రాంతాలకే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పల్లె వెలుగు బస్సు కోసం జనం పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నిన్న మొన్నటి వరకు గ్రామీణప్రాం తాల్లో ప్రయాణికులు లేక వెలవెలబోయిన బస్‌స్టాప్‌లు, రైల్వేస్టేషన్‌లు పండుగ ప్రభావంతో రద్దీగా మారాయి.

ప్రైవేటు కార్లకు డిమాండ్‌

రైల్లో ప్రయాణించడానికి రిజర్వేషన్‌ లేక, ఆర్టీసీలో ప్రయాణించేందుకు టికెట్లు దొరక్క తిరిగి పట్టణాలకు వెళ్లేందుకు ప్రయాణికులు నానా అవస్థలు పడుతు న్నారు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం వంటి దూర ప్రాంతాలకు వెళ్లేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అలాగే ట్రావెల్స్‌ బస్సుల వారు ధరలను పెంచి వసూలు చేస్తున్నారు. ఇక కొంతమంది ప్రైవేటు కార్లపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో వారు సైతం భారీగా బాడుగులు పెంచేశారు. ఫలితంగా ఒక కుటుంబం హైదరాబాదు వెళ్లడానికి రూ.10వేల నుంచి రూ.15వేల వరకు వ్యయం చేయాల్సి వస్తుంది.

Updated Date - Jan 18 , 2026 | 02:50 AM