అత్తింటి ఆరళ్లకు గర్భిణి బలి..!
ABN , Publish Date - Apr 02 , 2026 | 11:36 PM
అత్తింటి ఆరళ్లను తట్టుకోలేక ఓ గర్భిణి పురుగుమందు తాగి మృతి చెందింది. కనిగిరిలో గురువారం మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
పుట్టింటి నుంచి ఆస్తి తేవాలంటూ ఒత్తిడి
హింసలకు తాళలేక పురుగుమందు తాగి మృతి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
ఆమె మరణ వాంగ్మూలం మేరకు తెలంగాణలో కేసు నమోదు
కనిగిరిలో అంత్యక్రియల నేపథ్యంలో మృతురాలి బంధువుల ఆందోళన
పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగిన ఉద్రిక్తత
కనిగిరి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : అత్తింటి ఆరళ్లను తట్టుకోలేక ఓ గర్భిణి పురుగుమందు తాగి మృతి చెందింది. కనిగిరిలో గురువారం మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఘటన గురించి మృతురాలి తల్లి తిరుపతమ్మ అందించిన సమాచారం మేరకు... మండలంలోని తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన కేతిరెడ్డి కొండారెడ్డి, తిరుపతమ్మలు ఉపాధి పనుల నిమిత్తం తెలంగాణలోని జహీరాబాద్‌లో ఉంటున్నారు. 5నెలల క్రితం వారి కుమార్తె వెంకటవినీతను కనిగిరి పట్టణానికి చెందిన పాతకొట్టు రమణారెడ్డి కుమారుడు రఘునాథరెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఇరువురు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వర్క్‌ఫ్రమ్‌హోం కారణంగా కనిగిరిలో ఉంటున్నారు. ఈక్రమంలో వినీత గర్భం దాల్చింది. అప్పటినుంచి అత్తింటి వారు వినీతను పుట్టింటి నుంచి ఆస్తి పంచుకుని తీసుకురావాలంటూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. గర్భిణి అనే కనికరం లేకుండా వినీత ఆడపడుచు కూడా పరుషంగా వ్యవహరిస్తుండేది.
ఆస్థిని పంచుకుని తేవాలంటూ చిత్రహింసలు
వినీత గర్భిణి కావటంతో ఆమె తల్లితండ్రులు ఇక్కడకు వచ్చి ఉగాది పండుగ ముందే జహీరాబాద్ తీసుకువెళ్లారు. అక్కడకెళ్లాక అత్తింటి వాళ్లు పెట్టిన చిత్రహింసలన్నీ తల్లితండ్రులకు చెప్పి రోదించింది. జీతం మొత్తం లాగేసుకునేవారు. తిండి కూడా సరిగా పెట్టేవాళ్లు కాదు. కేవలం ఉదయం టిఫిన్ కింద రెండు ఇడ్లే పెట్టేవారు.. వెళ్లి ఆస్తి పంచుకొస్తావా.. ఇంట్లోనే పాతేయమంటావా అంటూ అత్త, ఆడబిడ్డ, భర్త, మామలు కొట్టేవారని మృతురాలి తల్లి కన్నీటి పర్యంతమైంది. ఈ క్రమంలోనే జహీరాబాద్‌లోని ఇంట్లో ఎవరూ లేని సమయంలో వినీత పురుగుమందు సేవించింది. కొంతసేపటికి తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా వినీత వద్ద పురుగుమందు తాగిన ఆనవాళ్లు కనిపిండంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. తగిన సాక్ష్యాలతో జహీరాబాద్‌లో ఉన్న ఆసుపత్రిలో పోలీసులు, డాక్టర్‌లు ఎదుట విరీత మరణ వాంగ్మూలం ఇచ్చి మృతి చెందింది. దీంతో జహీరాబాద్‌లో మృతురాలి అత్త, భర్త, మామ, ఆడబిడ్డలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అంత్యక్రియల సమయంలో కనిగిరిలో ఉద్రిక్తత
ఈ క్రమంలో వినీత మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులు కనిగిరిలోని అత్తింటికి తరలించారు. తమ బిడ్డ చావుకు వారి అత్త, ఆడబిడ్డ, మామ, భర్తే కారకులని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్తి తీసుకుని రాలేదుగా.. ఇంట్లోనే పాతేస్తామన్నారుగా పాతేయండంటూ నిలదీశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేయించారు.