Share News

‘పది’ సప్లిమెంటరీ ఫలితాల్లో ప్రకాశం ఫస్ట్‌

ABN , Publish Date - Jun 20 , 2026 | 02:40 AM

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలలోఉమ్మడి ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు.

‘పది’ సప్లిమెంటరీ ఫలితాల్లో ప్రకాశం ఫస్ట్‌

ఈ ఏడాది 97.96 శాతం ఉత్తీర్ణత

బాలికలకంటే బాలురదే స్వల్పంగా పైచేయి

ఒంగోలు(విద్య), జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలలోఉమ్మడి ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. జిల్లాలోని ఉత్తీర్ణత వివరాలను డీఈవో సీవీ రేణుక వెల్లడించారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలలో గత నాలుగు సంవత్సరాలుగా జిల్లా విద్యార్థులు ప్రథమస్థానంలో నిలిచి భళా అనిపించారు. ఈ ఏడాది 97.96 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల సాధనలో బాలికల కంటే బాలురే స్వల్పంగా పైచేయి సాధించారు. సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 2,506 మంది హాజరు కాగా 2,455 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 1,454 మందికి 1,427మంది (98.14శాతం), బాలికలు 1,052 మందికి 1,028 మంది (97.72శాతం) ఉన్నారు. రాష్ట్రంలో సగటున 82.39శాతం మంది ఉత్తీర్ణులు కాగా జిల్లాలో దానికి 15.6శాతం అదనంగా ఉంది. ఈ పరీక్షలలో నూరుశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేసిన 20 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సత్ఫలితాలు ఇవ్వడంతో విద్యార్థులు భారీ ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలిచారు.

నాలుగురోజులలో సర్టిఫికెట్‌లు

సప్లిమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్‌లో అడ్మిషన్లు పొందేందుకు అవసరమైన మార్కుల ధ్రువపత్రాలను నాలుగు రోజుల్లో అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ కె.వి.శ్రీనివాసులరెడ్డి తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలలో సాధించిన మార్కులపై ఎవరికైనా అనుమానాలు ఉంటే ఈనెల 20వతేదీ నుంచి 26వతేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.

Updated Date - Jun 20 , 2026 | 02:40 AM