Share News

ఉమ్మడి జిల్లాకు ‘పూర్వోదయ’

ABN , Publish Date - Jan 28 , 2026 | 02:27 AM

ఉమ్మడి జిల్లాలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తి, విస్తారంగా పండ్లతోటల సాగుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి కేంద్ర పథకమైన పూర్వోదయలో ఉమ్మడి జిల్లాను చేర్చారు.

ఉమ్మడి జిల్లాకు ‘పూర్వోదయ’
పూర్వోదయపై అమరావతిలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు

ప్రాజెక్టుల పూర్తితో జలాలు

ఉద్యాన పంటల అభివృద్ధి

ప్రాధాన్యత జాబితాలో వెలిగొండ, పాలేరు, కొరిశపాడు ఎత్తిపోతలు

ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షలో నిర్ణయం

ఒంగోలు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తి, విస్తారంగా పండ్లతోటల సాగుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి కేంద్ర పథకమైన పూర్వోదయలో ఉమ్మడి జిల్లాను చేర్చారు. దీని ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.10వేల కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెండింగ్‌ కీలక ప్రాజెక్టుల పూర్తితో సాగు భూములకు జలాలు అందించడం, రాయలసీమతోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధి కోసం ఈ పథకాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అమలుపై మంగళవారం అమరావతి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షను సీఎం చంద్రబాబు నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, సంబంధిత శాఖల మంత్రులు, కీలక రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లోని 20 ప్రాధాన్యత ప్రాజెక్టులను ఈ పథకం కింద గుర్తించి నిధులు కొరత లేకుండా పూర్తిచేయాలని ప్రతిపాదించారు. అందులో వెలిగొండ ప్రాజెక్టు, పాలేరు రిజర్వాయర్‌, కొరిశపాడు ఎత్తిపోతల ఉన్నాయి.

వెలిగొండపై ప్రత్యేక దృష్టి

ఇప్పటికే వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు దృష్టిసారించడంతో వేగంగా పనులు జరుగుతున్న విషయం విదితమే. తాజాగా మంగళవారం నాటి సమీక్షలోనూ ఈ ప్రాజెక్టుపై సమీక్ష చేసిన సీఎం.. ఎట్టిపరిస్థితుల్లో ఏడాదిలో ప్రాజెక్టును పూర్తిచేయాలని అదేశించారు. అలాగే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పాలేరు రిజర్వాయర్‌, కొరిశపాడు ఎత్తిపోతల పథకాన్ని కూడా ప్రభుత్వం గుర్తించిన 20 ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో చేర్చారు. ఇదిలా ఉండగా గ్లోబల్‌ మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యాన పంటలను అభివృద్ధి చేసి ఏడాదికి 500 మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి లక్ష్యంగా కార్యాచరణపై రాష్ట్రప్రభుత్వం దృష్టిసారించింది. రాయలసీమతోపాటు ప్రస్తుత ప్రకాశం, మార్కాపురం జిల్లాలను కలిపి ప్రపంచంలోనే పెద్ద హార్టికల్చర్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఈ పది జిల్లాలను 201 క్లస్టర్లుగా విభజన చేశారు. అందులో ఉమ్మడి జిల్లాలో 16 క్లస్టర్లు ఉండనున్నాయి. మూడేళ్లలో ఈ పథకం కింద రూ.90 కోట్లు వెచ్చించే అవకాశం ఉంది. పండ్లతోటల పెంపకానికి, ప్రోత్సాహకాలతోపాటు గ్రామీణ రోడ్లు, పుడ్‌ ప్రాసెసింగ్‌, గోడౌన్లు నిర్మాణం, ఇతర రవాణా మార్గాలు అభివృద్ధి చేయనుండగా వాటికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఈ సమీక్షలో ఆదేశించారు.

Updated Date - Jan 28 , 2026 | 02:27 AM