Share News

చెరువు పనులు ఇక చకచకా!

ABN , Publish Date - May 13 , 2026 | 03:10 AM

కనిగిరి నియోజకవర్గంలోని హెచ్‌ఎంపాడు మండలం హాజీపురం చెరువు అభివృద్ధి పనులు చకచకా జరగనున్నాయి. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యా నికి గురై ఆనవాళ్లు కోల్పోతున్న ఈ చెరువు పునరుద్ధరణకు ప్రజా ప్రభుత్వం రూ.2 కోట్ల ఓఅండ్‌ఎం (ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) నిధులను మంజూరు చేసింది.

చెరువు పనులు ఇక చకచకా!
ప్రస్తుతం హాజీపురం చెరువు పరిస్థితి ఇదీ

హాజీపురం తటాకం అభివృద్ధికి రూ.2కోట్లు

ఓఅండ్‌ఎం నిధులతో పనులకు శ్రీకారం

886 ఎకరాల ఆయకట్టుకు పునరుజ్జీవం

వైసీపీ పాలనలో సాగునీటి వనరులపై నిర్లక్ష్యం

చెరువుల పునరుద్ధరణపై ప్రజాప్రభుత్వం దృష్టి

కనిగిరి, మే 12 (ఆంధ్రజ్యోతి) : కనిగిరి నియోజకవర్గంలోని హెచ్‌ఎంపాడు మండలం హాజీపురం చెరువు అభివృద్ధి పనులు చకచకా జరగనున్నాయి. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యా నికి గురై ఆనవాళ్లు కోల్పోతున్న ఈ చెరువు పునరుద్ధరణకు ప్రజా ప్రభుత్వం రూ.2 కోట్ల ఓఅండ్‌ఎం (ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) నిధులను మంజూరు చేసింది. దీంతో 886 ఎకరాల ఆయకట్టు రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. చెరువుకు పునరుజ్జీవం లభించబోతుందన్న ఆనందం వ్యక్తమవుతోంది. హెచ్‌ఎంపాడు మండలంలోని ప్రధాన సాగునీటి వనరుల్లో హాజీపురం చెరువు ఒకటి. మొత్తం 786 ఎకరాల వైశాల్యం కలిగిన ఈ చెరువు 0.3 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అధికారిక లెక్కల ప్రకారం 886 ఎకరాల ఆయకట్టు కాగా దాదాపు 1,200 ఎకరాలు సాగుకు ఉపయుక్తంగా ఉంటుందీ చెరువు. వర్షాకాలంలో నిల్వయ్యే నీటితో హాజీపురం సహా పరిసర గ్రామాల్లో వరి, మిర్చి, కంది, పప్పుధాన్యాలు సాగవు తుంటాయి. కాలక్రమేణా చెరువు కట్టలు బలహీపడటం, గేట్లు దెబ్బతినడం, కాలువలు పూడికతో నిండిపోవవడం వంటి సమ స్యలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. సరైన మరమ్మతులు లేకపోవడంతో ఏటా ఆయకట్టు రైతులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇటీవల ఇరిగేషన్‌శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి సమస్యను వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందించి హాజీపురం చెరువు అభివృద్ధికి నిధులు కేటాయించారు.

సాగునీటి వనురులు, చెరువులపై ప్రజాప్రభుత్వం ఫోకస్‌

ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రవ్యాప్తంగా నీటివనరుల పరిరక్షణ, చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించింది. రెండు నెలల క్రితం కనిగిరి నియోజకవర్గానికి రూ.3.9 కోట్ల ఆధునీకరణ పనులకు ఎఫ్‌డీఆర్‌ నిధులు కేటాయించింది. వాటిలో హెచ్‌ఎంపాడు మండలంలో హాజీపురం చెరువుకు 2 పనులు, తిమ్మారెడ్డిపల్లి, దాసళ్లపల్లి, నందనవనం, సీతారాంపురం చెరువులకు ఒక్కో వర్కుకు కలిపి రూ.34.49 లక్షలు కేటాయించింది. ఇప్పుడు అదనంగా హాజీపురం చెరువుకు మరో రూ.2 కోట్ల ఓఅండ్‌ఎం నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో చెరువు కట్ట బలోపేతం, గేట్ల మరమ్మతులు, పూడికతీత, ఫీడర్‌ కాలువలు శుభ్రం చేయడం, నీటి పంపిణీ వ్యవస్థ అభివృద్ధి వంటి కీలక పనులు చేపట్టే అవకాశం ఉంది. హాజీపురం చెరువు ఆయకట్టు కింద హెచ్‌ఎంపాడు, హాజీపురం, కొత్తూరు, దొడ్డిచింతల, కిష్టంపల్లి, కూటాగుండ్ల, సీతారాంపురం గ్రామాలకు చెందిన భూములు ఉంటాయి. ఈ చెరువు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే దాని పరిధి గ్రామాల్లోని ఆయకట్టులో పంటల సాగుకే కాకుండా భూగర్భ జలాల పెరుగుదలకు కూడా దోహదం చేస్తుంది.

Updated Date - May 13 , 2026 | 03:10 AM