పోలింగ్ ఏర్పాట్లు చకచకా
ABN , Publish Date - Oct 29 , 2026 | 02:49 AM
పుర ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్‌కు సమయం సమీపిస్తుండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చకచకా చేస్తున్నారు జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు అద్దంకి, చీమకుర్తి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే.
ఇప్పటి నుంచే కేంద్రాల వద్ద సౌకర్యాలు
ఒంగోలు కార్పొరేషన్, అద్దంకి,
చీమకుర్తి మునిసిపాలిటీల్లో ఎన్నికలు
303 పోలింగ్ కేంద్రాలు సిద్ధం
సిబ్బందికి పూర్తయిన శిక్షణ
ఒంగోలు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : పుర ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్‌కు సమయం సమీపిస్తుండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చకచకా చేస్తున్నారు జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు అద్దంకి, చీమకుర్తి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. ఆయా పట్టణాల్లో ఉన్న అభ్యర్థుల తుది జాబితాలను ఆదివారం రాత్రి ప్రకటించగా ఇక తదుపరి ఘట్టమైన పోలింగ్ నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. ఒకవైపు పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించి తదనుగుణంగా బ్యాలెట్ పత్రాల ముద్రణ, మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్ రాజాబాబు పర్యవేక్షణలో ఆయా పట్టణ స్థానిక సంస్థలకు చెందిన రిటర్నింగ్ అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఒంగోలు కార్పొరేషన్‌లో మొత్తం 62 డివిజన్లు ఉండగా మూడు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 59 డివిజన్లలో కార్పొరేటర్లు, మేయర్ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. అద్దంకిలో 32 వార్డులు ఉండగా మూడు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 29వార్డు కౌన్సిలర్లు, చైర్మన్ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. చీమకుర్తిలో చైర్మన్ స్థానంతోపాటు 28 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నవంబరు 1న పోలింగ్ జరగనుంది.
303 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
ఒంగోలులో 224, అద్దంకిలో 49, చీమకుర్తిలో 30 వెరసి 303 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా అర్బన్ స్థానిక సంస్థ యూనిట్‌గా పోలింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెల క్రితమే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వాటికి ఎన్నికల సామగ్రి, సిబ్బంది తరలింపునకు రూట్లు, జోన్‌ల వారీ పంపిణీ చేసేలా రూట్‌మ్యాప్‌లతోపాటు పోలింగ్ సిబ్బంది నియామకం పూర్తిచేశారు. రెండు విడతలుగా సిబ్బందికి శిక్షణ కూడా పూర్తిచేశారు. పోలింగ్ కేంద్రాలుగా అధికశాతం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను ఎంపిక చేసి వాటిలో బారికేడ్ల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు చేస్తున్నారు.
ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి
ఒంగోలు కార్పొరేషన్‌లో 242 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిని ఆరు జోన్లు, 22 రూట్‌లుగా విభజించారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది 538మందికి శిక్షణ పూర్తి చేశారు. 500 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసి సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో భద్రపర్చారు. ఒంగోలు కార్పొరేషన్‌కు సంబంధించి రిసెప్షన్ సెంటర్‌ను అక్కడే ఏర్పాటు చేసిన అధికారులు పోలింగ్‌కు ముందురోజైన ఈనెల 31న అక్కడి నుంచి మెటీరియల్, సిబ్బందిని ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఆలాగే అద్దంకిలో 49 పోలింగ్ కేంద్రాలు ఉండగా 330మంది సిబ్బందిని నియమించి శిక్షణ పూర్తి చేశారు. అక్కడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి ముందు రోజు అక్కడి నుంచి పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది, మెటీరియల్‌ను తరలించే ఏర్పాటు చేశారు ఇందుకోసం మూడు జోన్లు, ఆరు రూట్లుగా విభజించారు. అలాగే చీమకుర్తిలో 30 పోలింగ్ కేంద్రాలు ఉండగా 180 మంది సిబ్బందిని నియమించి శిక్షణ పూర్తి చేశారు. అక్కడి మునిసిపల్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది, మెటీరియల్ తరలించనున్నారు. ఇందుకోసం పట్టణాన్ని మూడు జోన్లుగా, ఐదు రూట్లుగా విభజించారు.