కమిషనర్ సెలవులో రాజకీయం
ABN , Publish Date - Apr 15 , 2026 | 03:05 AM
ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు సెలవుపై వెళ్లడం ఇప్పుడు నగరమంతా చర్చనీయాంశంగా మారింది. వారం క్రితం వరకు విధి నిర్వహణలో బిజీగా ఉన్న ఆయన ఒక్కసారిగా నెలరోజులపాటు సెలవు పెట్టడం వెనుక ‘రాజకీయం’ ఉన్నట్లు కనిపిస్తోంది.
విధి నిర్వహణలో ఒత్తిళ్లే కారణం?
కొందరు సిబ్బంది పనిచేయకుండా కీలక ప్రజాప్రతినిఽధికి ఫిర్యాదులు
ప్రజాసమస్యల పరిష్కారం విషయంలోనూ విమర్శలు
చర్చనీయాంశంగా మారిన వెంకటేశ్వరరావు వ్యవహారం
ఒంగోలు కార్పొరేషన్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు సెలవుపై వెళ్లడం ఇప్పుడు నగరమంతా చర్చనీయాంశంగా మారింది. వారం క్రితం వరకు విధి నిర్వహణలో బిజీగా ఉన్న ఆయన ఒక్కసారిగా నెలరోజులపాటు సెలవు పెట్టడం వెనుక ‘రాజకీయం’ ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి ఆరోపణలు, మరోవైపు బీపీఎస్‌లో అవినీతిపై ఏసీబీ అధికారుల దాడులు, నగరంలోని సమతానగర్‌లోని ఓ పార్కు వ్యవహారం... ప్రజాప్రతినిధులు, కమిషనర్ మధ్య దూరం పెరగడానికి కారణమైనట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేసే కొందరు అధికారపార్టీ సానుభూతి పరులు తమను కమిషనర్ ఇబ్బందులు పెడుతున్నారని ప్రజాప్రతినిధికి ఫిర్యాదుచేసినట్లు తెలిసింది. అంతేకాకుండా నగరంలోని పలు డివిజన్లలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు కొన్ని పరిష్కారానికి నోచుకోకపోవడంతో కమిషనర్ పనితీరుపై అధికార పార్టీ ప్రజాప్రతినిధి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. నాలుగు నెలల కిత్రం రీజనల్ డైరెక్టర్‌గా ఉద్యోగోన్నతి పొందిన వెంకటేశ్వరరావు ఆ బాధ్యతలు తీసుకోకుండా ఇంకో ఏడాదిపాటు ఇక్కడే ఉంటానని చెప్పారు. అలాంటిది ఒక్కసారిగా నెలరోజులపాటు సెలవుపై వెళ్లడం ఇటు కార్యాలయంలోనూ, ఇటు నగర ప్రజల్లోనూ చర్చనీయాంశమైంది.
ఆ పార్కు విషయంలోనే..
నగరంలోని సమతానగర్‌లోని మునిసిపల్ పార్కుకు శ్రీకృష్ణదేవరాయ పార్కు పేరు పెట్టాలని తాజా మాజీ జనసేన కార్పొరేటర్లు పట్టుబట్టారు. కొద్దినెలల క్రితం జరిగిన సమావేశంలో అదే అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఆ సమయంలో ఆ అంశాన్ని వాయిదా వేశారు. అయితే గతనెల 17న జరిగిన కౌన్సిల్ చివరి సమావేశంలో మళ్లీ పార్కుకు పేరు పెట్టే అంశం మరోసారి ప్రస్తావనకు రావడం, రద్దుచేయడం వంటి అంశాలలో కమిషనర్ తగిన విధంగా నిర్ణయాలు తీసుకోలేదని అధికారపార్టీకి చెందిన కొందరు భావించారు. ఆయన పనితీరుపై ప్రజాప్రతినిధికి ఫిర్యాదుచేసినట్లు సమాచారం. ప్రత్యేకించి అధికారపార్టీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకొచ్చే సమస్యలు కొన్నింటిని నిబంధనల ప్రకారం చేయలేనని కమిషనర్ బదులివ్వడంపైనా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఒక్కొక్కరుగా కమిషనర్ పనితీరును వేలెత్తిచూపడంతో ఆయన కొంతకాలంగా సెలవుపై వెళ్లడమే మంచిదని భావించినట్లు తెలుస్తోంది. మొత్తంగా కమిషనర్ సెలవుకి అటు సిబ్బంది నిర్లక్ష్యం, మరోవైపు అధికారపార్టీ పెత్తనం, ఇంకోవైపు కార్పొరేషన్‌లో అవినీతి కారణాలుగా తెలుస్తున్నాయి.
పారిశుధ్యంపైనా ఎమ్మెల్యే అసహనం
నగరంలో పారిశుధ్యంపై విపరీతంగా విమర్శలు ఉన్నాయి. నాలుగు రోజులకొకసారి కూడా కార్మికులు ఇంటింటి చెత్తకు రాకపోవడంపై ప్రజల నుంచి ఎమ్మెల్యే దామచర్లకు పదేపదే ఫిర్యాదులు అందాయి. అధికారికంగా 681మంది పారిశుధ్య కార్మికులు ఉండగా, అనధికారకంగా 900మంది ఉన్నారు. వారిలో సగంమంది కనీసం పనికి వెళ్లడం లేదు. అలాగే సచివాలయ శానిటరీ సెక్రటరీలు కూడా విధుల్లో అలసత్వం చూపడంతో ఎమ్మెల్యే ఆసంతృప్తి వ్యక్తం చేసి, కమిషనర్ పనితీరును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో ఇక సెలవు తీసుకోవడమే మంచిదని కమిషనర్ వెంకటేశ్వరరావు భావించినట్లు తెలుస్తోంది.
డివిజన్ల సమస్యల పరిష్కారంలో విమర్శలు
స్థానిక ప్రజాప్రతినిధి డివిజన్లలో పర్యటించినపుడు ప్రజల నుంచి వచ్చే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించగా అదేస్థాయిలో కమిషనరు క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీచేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో సిబ్బంది అలసత్వం కారణంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో తిరిగి అవే సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
ఈనెల 7వ తేదీనే సెలవుకు విన్నపం
కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నగరాభివృద్ధిలోనూ, సమస్యాత్మకమైన వాటిని సులువుగా పరిష్కరించడంలోనూ వెంకటేశ్వరరావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన సెలవుపై వెళ్లాలి అనుకునే ప్రతిసారీ తనకు సీసీగా ఉన్న ఉద్యోగికి చెప్పి, సీడీఎంఏకే లెటర్ పెట్టుకునే కమిషనర్ ఈసారి మాత్రం ఎవరికీ తెలియకుండా తానే స్వయంగా15 రోజులపాటు వ్యక్తిగత సెలవు కోరుకొన్నారు. అయితే సోమవారం సీడీఎంఏ నుంచి ఏకంగా నెలరోజులపాటు సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు రావడం మరింత చర్చనీయాంశమైంది. కాగా నెలరోజుల సెలవుకు కారణాలపై ఆంధ్రజ్యోతి కమిషనర్‌ను వివరణ కోరగా, వేసవి కారణంగా తనకు చర్మ సంబంధమైన సమస్యలు వస్తున్నాయని, వైద్యం కోసం ధర్మస్థలి వెళ్లాల్సినందున తాను సెలవు కోరానని సమాధానమిచ్చారు.