Share News

ఒంగోలులో రాజకీయ రచ్చ

ABN , Publish Date - Mar 04 , 2026 | 02:55 AM

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, మాజీ మంత్రి, జన సేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య ఆరంభమైన రాజకీయ రచ్చ తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. పార్టీలు, రాజకీయాలకతీతంగా వ్యక్తిగత సవాళ్లు విసురుకుంటున్నారు.

ఒంగోలులో రాజకీయ రచ్చ

కత్తులు దూసుకుంటున్న దామచర్ల, బాలినేని

ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రెస్‌మీట్లు

శకుని పాత్ర పోషిస్తున్న వైసీపీ

చోద్యంచూస్తున్న కూటమి పార్టీల అధిష్ఠానాలు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, మాజీ మంత్రి, జన సేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య ఆరంభమైన రాజకీయ రచ్చ తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. పార్టీలు, రాజకీయాలకతీతంగా వ్యక్తిగత సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ అవకాశాన్ని ఇరుపార్టీలకు ప్రత్యర్థి అయిన వైసీపీ చక్కగా వినియోగించుకుంటోంది. సహజసిద్ధమైన శైలితో ఇరువురినీ రెచ్చగొట్టే పనిలో నిమగ్నమైంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమిలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన అధిష్ఠానాలు మాత్రం చోద్యం చూస్తున్నాయి. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆ పార్టీల శ్రేణులు ఆవేదన చెందుతుండగా వైసీపీ నాయకులు సంబరపడిపోతున్నారు. ఈ రాజకీయ రచ్చకు కారణమేమిటన్న విషయం అన్ని వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ రాజకీయ ఆరంగ్రేటం నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రాష్ట్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్‌ నుంచి వైసీపీలో చేరి ఆ పార్టీలో రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగారు. అనూహ్యంగా గత ఎన్నికల అనంతరం బాలినేని వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇది రాజకీయంగా కూడా ఎవరూ ఊహించని పరిణామం. నిజానికి గత ఎన్నికల సమయం లోనే బాలినేని టీడీపీలో చేరతారన్న ఊహాగానాలు వచ్చా యి. అతన్ని చేర్చుకునేందుకు ఆ పార్టీ కూడా సిద్ధమైంది. అయితే ఎక్కడి నుంచి బాలినేని పోటీచేయాలన్న విషయం లోనే తేడాలొచ్చాయి. బాలినేని ఒంగోలు నుంచే పోటీ చేయాలని పట్టుబట్టగా, టీడీపీ అధిష్ఠానం దర్శి నుంచి అవకాశం ఇస్తామని తేల్చిచెప్పింది. ఆ విషయంలో అప్పట్లో టీడీపీ యువనేత నారా లోకేష్‌ చెప్పిందే చెల్లింది. అదేసమయంలో బాలినేని బయటకు పోకుండా ఆపుకునేందుకు వైసీపీ అధినేత జగన్‌ చేసిన ప్రయత్నం ఫలించింది. అయితే వైసీపీ అధికారం కోల్పోయిన కొన్నినెలల తర్వాత బాలినేని ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. అందుకు కారణాలు ఏమైనా కూటమి పార్టీలలో ఉన్న ఎమ్మెల్యే జనార్దన్‌, బాలినేనిల మధ్య మాత్రం సఖ్యత కుదరలేదు.

మొదటి నుంచి సవాళ్లే..

దామచర్ల, బాలినేని ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నప్పుడు సవాళ్లు విసురుకున్నారు. అదేతరహాలో ఇప్పుడూ కొనసాగుతున్నారు. ఆ విషయంలో టీడీపీ, జనసేనల అధిష్ఠానాలు చోద్యంచూస్తున్నాయి. మరోవైపు ఎన్నికల తర్వాత వైసీపీ వివిధ కారణాలతో జిల్లాలో మరింత డీలాపడిన మాట వాస్తవం. బాలినేని లేని లోటును ఎవరూ పూడ్చలేకపోయారు. ఇదేసమయంలో అందివచ్చిన అవకాశంలా దామచర్ల, బాలినేనిల మధ్య నెలకొన్న రాజకీయ వివాదాన్ని సొమ్ము చేసుకునేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. ఇదిలాఉండగా రాష్ట్రస్థాయిలో టీడీపీ, జనసేన పార్టీల అగ్ర నేతలు సఖ్యతతో ముందుకు సాగుతున్నారు. ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు రాకపోతాయా అని ఎదురుచూసిన వైసీపీ అధినాయకత్వం ఆశలు కూడా ఫలించలేదు. ఇటు సీఎం చంద్రబాబునాయుడు, టీడీపీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకపాత్ర పోషిస్తున్న నారా లోకేష్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ల మధ్య సఖ్యత రాజకీయ విశ్లేషకులు ఊహించనంత స్థాయిలో కొనసాగుతోంది. కానీ ఒంగోలులో చూస్తే అటు జనార్దన్‌, ఇటు బాలినేనిల మధ్య యుద్ధం ఆరంభమైంది. రెండు మూడు నెలలకొకసారి వారిద్దరూ ఢీ అంటే ఢీ అని సవాళ్లు విసురుకుంటున్నారు. కూటమి పార్టీలో ఉన్నామన్న విజ్ఞతతో మెలిగేందుకు ఇద్దరు నాయకులు సిద్ధం కాలేదని తేలిపోయింది. వారిని ఒక గాడిలో నడపాలన్న తపన ఆ పార్టీ రాష్ట్ర నాయకుల్లోనూ కనిపించటం లేదు.

మరుగునపడుతున్న అభివృద్ధి అంశాలు

ప్రత్యర్థి పార్టీల నాయకుల మధ్య జరుగుతున్న పోరు కన్నా తీవ్రస్థాయిలో మాటలయుద్ధం ఈ ఇద్దరి మధ్య ప్రారంభమైంది. గతంలో బాలినేని ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అనేక అంశాలను జనార్దన్‌ వేలెత్తిచూపుతున్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయంటూ బాలినేని ప్రశ్నించడం ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఉంటూ నెలకొకసారి ఒంగోలు వచ్చి నువ్వు చేస్తున్న ఆరోపణలలో నిజాయితీ లేదంటూ జనార్దన్‌ ప్రతిసవాల్‌ విసురుతున్నారు. గత వైసీపీ పాలనలో అక్రమాలను ప్రశ్నించే సమయంలో ఇప్పుడు జరుగుతున్న అక్రమాలను ఎందుకు దాచిపెట్టారంటూ బాలినేని సవాల్‌ విసురుతున్నారు. ఈ రచ్చ మధ్య జరుగుతున్న, జరగాల్సిన అభివృద్ధి అంశాలు మరుగునపడుతున్నాయి. ఈ ఇద్దరి నేతల ఆరోపణల్లో నిజానిజాలు పక్కనపెడితే ఒంగోలు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు బీజం పడింది మాత్రం నిజం.

వేచి చూస్తున్న వైసీపీ

రాజకీయ విశ్లేషకుల అంచనా మేరకు ఇటు జనసేన, అటు వైసీపీ అధిష్ఠానాల వ్యవహారశైలి చర్చనీయాంశమైంది. బాలినేనిని జనసేన అధిష్ఠానం పార్టీలో చేర్చుకున్నా కిందిస్థాయిలో ఆ పార్టీ నాయకుల మధ్య సమన్వయం సాధించడంలో పూర్తిగా విఫలమైంది. మొదటి నుంచి జన సేనలో ఉన్న కొందరు నాయకులు బాలినేనితో కలిసి ప్రయాణించేందుకు సిద్ధంగా లేరు. దీంతో జనసేనలో తొలి నుంచి ఉన్న నాయకుల్లో కొందరు ఒకవైపు.. బాలినేని, అతనితోపాటు వచ్చిన వారు మరోవైపు ఉండి ఆ పార్టీ వ్యవహారాలను కూడా రచ్చకెక్కించారు. ఇదేసమయంలో వైసీపీ విషయానికొస్తే బాలినేని వెళ్లిపోయిన అనంతరం ఆ పార్టీ జిల్లా నాయకత్వం కానీ, ప్రత్యేకించి ఒంగోలు నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు కానీ ఏమాత్రం కుదుటపడలేదు. ఇప్పటికీ వైసీపీలోని కొందరు నాయకులు బాలినేనితో సఖ్యతతో కొనసాగుతున్నారు. ఇదేసమయంలో స్థానిక పరిస్థితులతో కొందరు జనసేనలో బాలినేనిని వ్యతిరేకించే వారు టీడీపీ నాయకులకు దగ్గరయ్యారు. దీన్ని గమనించిన వైసీపీ అధిష్ఠానం ఒకవైపు జనసేనలో బాలినేని వ్యతిరేకులను రెచ్చగొట్టడం ప్రారంభించింది. ఇంకోవైపు బాలినేనితో సఖ్యతతో ఉన్న వైసీపీ వారికి ఆయన పట్ల అమితమైన అభిమానం అధిష్ఠానంకు ఉందన్న ప్రచారాన్ని ప్రారంభించింది. తదనుగుణంగా కొందరు వైసీపీ నేతలు ఏదో ఒక అంశాన్ని సాకుగా ఎంచుకుని బాలినేనికి టచ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది.

రాజుకున్న రాజకీయ వేడి

ఇరువురి నేతల ఆరోపణల్లో నిజమెంత అనేది పక్కనపెడితే కుటుంబసభ్యులను కూడా కలపటంతో రాజకీయ వేడి తీవ్రమైంది. దీన్ని వైసీపీ సంబరపడిపోతోంది. ఆపార్టీ నేతలు చాపకింద నీరులా ఇద్దరినీ రెచ్చగొట్టే పనిలో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. దీంతో ఒంగోలులో జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్రస్థాయిలో తెలుగుదేశం, జనసేనల మధ్య ఉన్న సఖ్యత మరుగునపడి సరికొత్త రాజకీయ చిచ్చుకు ఈ వ్యవహారం దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యే జనార్దన్‌ చెప్పినట్లు బాలినేని స్థానికంగా ఉండకుండా అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చిపోతున్న మాట నిజం. బాలినేని అన్నట్లు దామచర్ల కూడా రెండేళ్లు కనపడలేదన్న మాటలో నిజం ఎలా ఉన్నా ఇప్పుడు అది అప్రస్తుతం. ఇప్పుడు జరుగుతుంది, జరగబోతున్నదే ప్రజలకు, పార్టీలకు కావాలి. అంతకన్నా ఇద్దరూ ఒంగోలు అభివృద్ధికన్నా వ్యక్తిగత రాజకీయ అంశాలకే ప్రాధాన్యతనిస్తారన్న అభిప్రాయం ప్రజల్లో పెరిగిపోతోంది. రాజకీయంగా కూటమి పార్టీలకు మచ్చతెచ్చే ఈ వ్యవహారానికి తెరదించేందుకు రాష్ట్ర నాయకత్వాలు జోక్యం చేసుకుంటాయా? వైసీపీ ఆడుతున్న శకుని పాత్ర ఫలిస్తుందా? అనేది వేచిచూడాలి.

Updated Date - Mar 04 , 2026 | 02:55 AM