Share News

లారీ డ్రైవర్‌ ప్రాణాలను కాపాడిన పోలీసులు

ABN , Publish Date - Jun 16 , 2026 | 11:58 PM

ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోతున్నట్లు లారీ డ్రైవర్‌ కుటుంబసభ్యులకు ఫోన్‌ చేశాడు.. సమాచారం అందుకున్న సంతమాగులూరు పోలీసులు వెనువెంటనే స్పందించి లోకేషన్‌ ఆధారంగా అతని ప్రాణాలు కాపాడారు.

లారీ డ్రైవర్‌ ప్రాణాలను కాపాడిన పోలీసులు
వెల్లడిస్తున్న సీఐ శేషగిరిరావు, ఎస్సై పట్టాభిరామయ్య

ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్టు కుటుంబ సభ్యులకు ఫోన్‌

వారు వెంటనే 112కు ఫోన్‌

స్పందించిన సంతమాగులూరు సీఐ, ఎస్సై

లోకేషన్‌ గుర్తించి ఆస్పత్రికి తరలింపు

సంతమాగులూరు(అద్దంకి), జూన్‌ 16(ఆంధ్రజ్యోతి) : ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోతున్నట్లు లారీ డ్రైవర్‌ కుటుంబసభ్యులకు ఫోన్‌ చేశాడు.. సమాచారం అందుకున్న సంతమాగులూరు పోలీసులు వెనువెంటనే స్పందించి లోకేషన్‌ ఆధారంగా అతని ప్రాణాలు కాపాడారు. కర్నూలు పట్టణానికి చెందిన అబ్దుల్‌ రవూఫ్‌ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం గుంటూరు వైపు వెళ్తూ మార్గమద్యంలో కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోతున్నట్లు తెలిపాడు. వెంటనే కుటుంబ సభ్యులు 112 నెంబర్‌కు సమాచారం అందించారు. ఒంగోలు సీసీఆర్‌ నుంచి వచ్చిన సమాచారం మేరకు సంతమాగులూరు సీఐ శేషగిరిరావు, ఎస్సై మేదరమెట్ల పట్టాభిరామయ్య అప్రమత్తమయ్యారు. ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా లారీ డ్రైవర్‌ ఉన్న లోకేషన్‌ గుర్తించారు. పుట్టావారిపాలెం వద్ద అతను ఉన్నట్లు గుర్తించి వెంటనే ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. కుటుంబ కలహాల నేపథ్య్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. పోలీసులు వెంటనే స్పందించి లారీ డ్రైవర్‌ ప్రాణాలు కాపాడటం పట్ల పోలీసు అధికారులకు పలువురు అభినందనలు తెలిపారు.

Updated Date - Jun 16 , 2026 | 11:58 PM