రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసుల దృష్టి
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:22 PM
రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీస్ అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అద్దంకి ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు మరింత పెరిగాయి.
ప్రాథమిక చర్యలకు ఉపక్రమించిన ఉన్నతాధికారులు
భవానీ సెంటర్‌లో మైక్‌ల ద్వారా ప్రచారం, దర్పణాల ఏర్పాటు
అద్దంకి, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీస్ అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అద్దంకి ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు మరింత పెరిగాయి. నామ్ రోడ్డుతో పాటు దర్శి రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతూ వాహనచోదకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో పలువురు క్షతగాత్రులు అవుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనచోదకులకు అవగాహన కల్పించేందుకు అద్దంకి పట్టణంలో మైక్ సెట్‌ల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. భవానీసెంటర్ కూడలిలో ఉన్న హైమాస్ లైట్‌కు మూడు వైపులా మూడు మైకులు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతా నియమాలను వివరిస్తూ అనౌన్స్ చేయిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, పాత బస్టాండ్ లో కూడా ఇదే విధంగా అనౌన్స్ చేయించే విధంగా మైకులు ఏర్పాటు చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో పట్టణంలో భవానీసెంటర్, రామ్‌నగర్‌లలో ఎదురు, పక్క నుంచి వచ్చే వాహనాల రాకపోకలను గుర్తించే విధంగా దర్పణాలు(కుంభాకార అద్దాలు) ఏర్పాటు చేశారు. నామ్ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టనున్నట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు. ప్రమాదాల నివారణకు తాత్కాలిక చర్యలతో పాటు నామ్ అధికారులతో సంప్రదించి శాశ్వత చర్యలు చేపట్టాలని వాహనచోదకులు, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.