పోలీస్ పంజా
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:27 PM
ఉమ్మడి జిల్లాలో పోలీసులు స్పీడు పెంచారు. ఒకవైపు పెచ్చరిల్లుతున్న అసాంఘిక కార్యకలాపాల కట్టడి, మరోవైపు నేరాల పెరుగుదలకు ప్రధాన కారణమవుతున్న మాదకద్రవ్యాల నియంత్రణ లక్ష్యంగా దాడులు ముమ్మరం చేశారు. ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు ఆదేశాలతో రెండు జిల్లాల్లోని క్షేత్రస్థాయి పోలీసు అధికారులు, సిబ్బంది స్పీడు పెంచారు. సాంకేతికతను కూడా వినియోగించుకుంటున్నారు. డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. దీంతో నిర్జన ప్రదేశాలు, పొలాలు, ఇతర రహస్య స్థావరాలపై నిర్వహిస్తున్న కార్యకలాపాలు సైతం వెలుగు చూస్తున్నాయి. నెలన్నరగా రెండు జిల్లాల్లో పోలీసులు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడులు, ఆ సందర్భంగా జరిగిన అరెస్టులు, నగదు స్వాదీనం వివరాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
అసాంఘిక కార్యకలాపాలు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం
ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశాలతో క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు
డ్రోన్ కెమెరాలతో స్థావరాల గుర్తింపు
నెలన్నరలో 41 పేకాట, 10 కోడి పందేల స్థావరాలపై దాడులు
పెద్ద సంఖ్యలో అరెస్టులు, భారీగా నగదు స్వాధీనం
విస్తారంగా కార్డెన్ సెర్చ్‌లు, ప్రజలకు అవగాహన
ఒంగోలు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు పంజా విసురుతున్నారు. ఎక్కడికక్కడ వాటిపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి, మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలను నియంత్రించే విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. గత కొన్ని నెలలుగా దాడులు ముమ్మరం చేశారు. ఇటీవల వాటిని మరింత విస్తృతం చేశారు. ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఈ వ్యవహారాలపై దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నేరాల విస్తృతికి ప్రధాన కారణాలవుతున్న అసాంఘిక కార్యకలాపాలు, మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టాలని ఆదేశించడంతో పోలీసులు ఆవైపు కదిలారు. తొలుత ఈ తరహా కార్యకలాపాలు జరిగే ప్రాంతాలను గుర్తించారు. ప్రత్యేకించి పట్టణ శివారులలో ముళ్లచెట్లతో నిండిపోయిన, పాడుబడి ఉన్న ప్రాంగణాలు, భవనాలు వంటివి 390కిపైగా ఉన్నట్లు గుర్తించి ఆ ప్రాంతాలను పరిశుభ్రపరిచే చర్యలు చేపట్టారు. తద్వారా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి స్థావరాలను కొంతమేరకు నియంత్రించారు. అయినా అలవాటు పడిన వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో వాటిని కొనసాగిస్తున్నారు. దీంతో వాటి కట్టడిపై దృష్టిపెట్టారు. మరోవైపు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, మాదక ద్రవ్యాల వల్ల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ విషయాల్లో ఉదాసీనంగా ఉన్న పలువురు డీఎస్పీలు, సీఐలు, ఇతర అధికారులకు ఇటీవల ఎస్పీ షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో మరింత సీరియస్‌గా కదిలారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పోలీసుల దాడులు, తనిఖీలు, అరెస్టులు, నగదు స్వాధీనం, అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం, నెంబర్లు లేని వాహనాల స్వాధీనం వంటివి జరుగుతూనే ఉన్నాయి.
పేకాట, కోడిపందేల స్థావరాలపై దాడులు
ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటి వరకు రెండు జిల్లాల పరిధిలో 41 పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 189 మంది జూదరులను అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.4.82 లక్షల మేర నగదును స్వాధీనం చేసుకున్నారు. పది కోడి పందేల శిబిరాలపై దాడులు చేసి 84 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.2.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంకోవైపు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లపై కూడా ఎస్పీ దృష్టి సారించడంతో కిందిస్థాయి అధికారుల్లోనూ కదలిక వచ్చింది. ఇందుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి రూ.24 లక్షల నగదు, 21 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐదు స్థావరాలపై దాడులు చేసి పది మందిని అరెస్టు చేశారు. కోడిపందేలు వేసే మరో 98 మంది పాత నేరస్థులను బైండోవర్ చేశారు.
నిత్యం కార్డెన్ సెర్చ్‌లు
గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిల్వలు, విక్రయాలు చేసే ఇళ్లు, దుకాణాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పాత నేరస్థుల కదలికలపై నిరంతర నిఘా ఉంచుతున్నారు. ఆపరేషన్ వజ్ర కవచ్‌లో భాగంగా నిత్యం కార్డెన్ సెర్చ్‌లను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు నేతృత్వంలో మద్దిపాడు మండలంలో ఆదివారం తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 27 ద్విచక్రవాహనాలను స్వాఽధీనం చేసుకోవడంతోపాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. గుడ్లూరు సీఐ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలోనూ తనిఖీలు జరిగాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి ఏ సమాచారం తెలిసినా వెంటనే డయల్ 112 లేదా పోలీస్ వాట్సాప్ నెంబరు 9121102266కు మేసేజ్ ద్వారా తెలియజేయాలని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఒక ప్రకటనలో కోరారు.