అట్టహాసంగా పోలేరమ్మ తిరునాళ్ల
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:32 PM
పర్చూరు మండలంలోని నూతలపాడులో మంగళవారం గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల అత్యంత వైభవంగా జరిగింది.
నూతలపాడు(పర్చూరు), ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని నూతలపాడులో మంగళవారం గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల అత్యంత వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వేకువ జామునుంచే పశువులను, వాహనాలను తీసుకొచ్చి గుడి చుట్టూ తిప్పి స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. శిడిని పెళ్లి కొడుకుగా అలంకరించి ఊరేగింపుగా తీసుకువచ్చిన అనంతరం మహోత్సవం నిర్వహించటం ఆకర్షణ.
ప్రత్యేక ఆకర్షణగా శిడి మహోత్సవం
తిరునాళ్లలో భాగంగా శిడి మహోత్సవం వైభవంగా జరిగింది. శిడిమానుకు రైతులు పండించిన మిర్చి, మొక్కజొన్న కండెలు, జొన్నవంటి తదితర పంట ఉత్పత్తులను కట్టి పాడిపంటలతో గ్రామం సుభిక్షించాలంటూ అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం శిడిమానుకు ఏర్పాటు చేసిన బోనులో మేకపోతును అమర్చి భక్తుల దర్శనార్థం గ్రామోత్సవం నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు తరలిరావటంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. భక్తులకు సకల ఏర్పాట్లు చేశారు.
భారీ విద్యుత్ ప్రభలతో కోలాహలం
గ్రామస్థులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలతో తిరునాళ్లకు నూతన శోభ సంతరించుకుంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి సైతం పెద్దఎత్తున ప్రజలు తరలిరావటంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా మార్టూరు రూరల్ సర్కిల్ పరిధిలోని పర్చూరు, యద్దనపూడి, మార్టూరు మండలాల పోలీసులు బందోబస్తు నిర్వహించారు.