Share News

పుష్కలంగా జలధార

ABN , Publish Date - Apr 15 , 2026 | 03:09 AM

జిల్లాలో జలధార పనులను భారీ ఎత్తున చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. యంత్రాంగం పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమంపై దృష్టి సారించింది. పనుల గుర్తింపు కూడా చివరి దశకు వచ్చింది. ఇది పూర్తయిన తర్వాత గ్రామసభలలో పనులను ఆమోదించి కలెక్టర్‌కు పంపనున్నారు.

పుష్కలంగా జలధార
ముండ్లమూరు మండలంలో పనుల గుర్తింపును పరిశీలిస్తున్న జలవనరుల శాఖ ఎస్‌ఈ వరలక్ష్మి

జలవనరుల శాఖ పరిధిలోనే 2వేలకుపైగా పనులు

వనరులలోకి నీరు వచ్చే వాటికి ప్రాధాన్యం

జిల్లాలో 403 చెరువులతోపాటు చెక్‌డ్యాంలు, ఇతర నీటి వనరుల పరిశీలన

ఉపాధి పథకం పరిధిలోని వాటిపై డ్వామా ద్వారా గుర్తింపు, పూడికతీత ప్రధానాంశం

గ్రామసభల ఆమోదం అనంతరం అనుమతుల కోసం కలెక్టర్‌కు నివేదన

జిల్లాలో జలధార పనులను భారీ ఎత్తున చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. యంత్రాంగం పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమంపై దృష్టి సారించింది. పనుల గుర్తింపు కూడా చివరి దశకు వచ్చింది. ఇది పూర్తయిన తర్వాత గ్రామసభలలో పనులను ఆమోదించి కలెక్టర్‌కు పంపనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సాగునీటి చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలలోకి నీరు వచ్చే, వాటి ద్వారా పొలాలకు నీరు వెళ్లే ఫీడర్‌ సప్లయ్‌ చానళ్లు, పంట కాలువలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చెరువు కట్టల పటిష్టత, అత్యవసరమైన షట్టర్లు, అలుగులు ఇతరత్రా మరమ్మతులను కూడా ఈ వేసవిలో చేపట్టనున్నారు.

ఒంగోలు, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జలధార కార్యక్రమం కింద పనుల గుర్తింపు దాదాపు కొలిక్కి వచ్చింది. నిధులు అవసరమయ్యే వనరుల్లోకి నీరు వచ్చే ఫీడర్‌ కాలువలు, సప్లయ్‌ చానళ్లు, గొలుసుకట్టు చెరువులకు నీటి ప్రవాహం సాఫీగా వచ్చేందుకు అవసరమైన పనులకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. చెరువు కట్టల పటిష్టత, షట్టర్లు, అలుగులకు మరమ్మతులు, చెక్‌డ్యాంల ఆధునికీకరణ పనులతోపాటు అవసరమైన చోట్ల కొత్త చెక్‌డ్యాంల ప్రతిపాదనలు వంటి వాటిని జలవనరుల శాఖ సిబ్బంది గుర్తించారు. ఇందుకోసం గతనెల 6నుంచి జూలై 14 వరకు వంద రోజులపాటు జలధార్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టగా అనంతపురం జిల్లా యాడికిలో లాంఛనంగా ఈనెల 6వతేదీన సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అదేరోజు ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో చోట కార్యక్రమాన్ని చేపట్టారు. జరుగుమల్లి మండలం చిర్రికూరపాడులో మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, కలెక్టర్‌ రాజాబాబు ప్రారంభించారు.

వేగంగా పనుల గుర్తింపు

వందరోజుల కార్యక్రమంలో భాగంగా తొలి పదిరోజులు ఆయా నీటి వనరులను ఇటు జలవనరుల, అటు డ్వామా అధికారులు, సిబ్బంది పరిశీలించి పనులను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం వాటిని గ్రామసభల్లో ఆమోదం, కలెక్టర్‌ నుంచి అనుమతులు పొందడం, అంచనాలు రూపొందించడం వంటివి ఈ పది రోజుల్లో ముగించి 80 రోజుల్లో ఆ పనులు పూర్తిచేయాల్సి ఉంది. అలా ప్రభుత్వం షెడ్యూల్‌ ఇవ్వగా తదనుగుణంగా జిల్లాలో ఈనెల 6 నుంచి పనులు గుర్తింపుపై జలవనరుల, డ్వామా అధికారులు, సిబ్బంది దృష్టిసారించారు.

కొన్నిచోట్ల చెక్‌డ్యాంలు కూడా..

జిల్లాలో 519 పంచాయతీల పరిధిలో 403 చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలను జలవనరుల శాఖ సిబ్బంది పరిశీలించి వాటిలో సుమారు రెండు వేలకుపైగా పనులు చేపట్టడం అవసరమని ఇప్పటికే గుర్తించారు. సప్లయ్‌ చానళ్లు, ఫీడర్‌ కాలువలు, చెక్‌డ్యాంల ఆధునికీకరణ, అలుగులు, షట్టర్లు, ఇతరత్రా మరమ్మతు పనులు అధికంగా ఉన్నాయి. కొన్నిచోట్ల చెక్‌డ్యాంలను కూడా ప్రతిపాదిస్తున్నారు. డ్వామా సిబ్బంది ఉపాధి హామీ పథకం పరిధిలో చేపట్టేందుకు అవకాశం ఉన్న పనులను గుర్తిస్తున్నారు. ప్రధానంగా చెరువుల నుంచి నీరు బయటకు వెళ్లే పంట కాలువలు, నీటికుంటలు, నీటిని భూగర్భంలోకి చేర్చడం కోసం గతంలో తవ్విన కందకాలు, ఇతరత్రా వాటిలో పూడికతీత పనులను వారు ఎంపిక చేస్తున్నారు.

గ్రామసభలలో ఆమోదం

జిల్లాలో సుమారు 1,500 పనులు చేపట్టడం ద్వారా ఇంచుమించుగా 40లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడికతీత పనులను గుర్తిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా రెండు శాఖల పరిధిలో పనుల గుర్తింపు దాదాపు కొలిక్కి వచ్చింది. వాటికి మంగళ, బుధవారాల్లో గ్రామసభల ఆమోదం పొంది అనంతరం మంజూరు కోసం కలెక్టర్‌కు నివేదించేందుకు సంబంధిత శాఖల అధికారులు మండలాల వారీ జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఇలా భారీగా పనుల గుర్తింపు జరుగుతుండగా వాటి పూర్తికి నిధులు సమకూర్చడంపై అధికారుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఉపాధి హామీ పథకం పరిధిలోకి కొన్ని మాత్రమే రానుండగా అధిక శాతం పనులకు ప్రత్యేక నిధులు అవసరం. జలవనరులశాఖ గుర్తించిన పనులన్నింటికి కోట్లాది రూపాయలు అవసరమవుతుంది. వాటిని ఎలా సమకూర్చుతారన్నది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది.

Updated Date - Apr 15 , 2026 | 03:09 AM