Share News

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

ABN , Publish Date - Nov 10 , 2026 | 02:28 AM

విద్యార్థులకు మత్తు మాత్రలను సరఫరా చేసే ముఠాను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు. ఈనెల 7న నగరంలోని బాలాజీరావుపేటలో విద్యార్థులకు మత్తుమాత్రలు విక్రయిస్తున్న యువతీయువకులను ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

ఒంగోలులో మత్తు మాత్రల విక్రయం

ఓ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

ఒంగోలు క్రైం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మత్తు మాత్రలను సరఫరా చేసే ముఠాను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు. ఈనెల 7న నగరంలోని బాలాజీరావుపేటలో విద్యార్థులకు మత్తుమాత్రలు విక్రయిస్తున్న యువతీయువకులను ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక కేశవరాజుకుంటలో నివాసం ఉంటున్న ఐనంపూడి కోమలి, సత్యనారాయణపురానికి చెందిన ముసుగు గురుబ్రహ్మయ్యలు కలిసి మత్తు మాత్రల వ్యాపారం చేస్తున్నారు. ఒక్కో మాత్ర వంద రూపాయలకు విద్యార్థులకు అమ్ముతున్నారు. ఈ దందా చాలాకాలం నుంచి సాగుతోంది. కొంతమంది విద్యార్థులకు ఈ ముఠా వాటిని విక్రయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. మత్తుకు బానిసలైన విద్యార్థులు తక్కువ ధరకు మాత్రలు దొరుకుతుండటంతో వాటిని మింగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు ఆదేశాల మేరకు ఈనెల 7న బాలాజీరావు పేటలో మత్తు మాత్రలు అమ్ముతున్న ఇరువురిని పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని విచారించగా మస్తాన్‌దర్గా వద్ద ఉన్న ఓ మెడికల్‌ షాపులో తక్కువ ధరకు కొనుగోలు చేసి రూ.వందకు ఒక్కో ట్యాబ్‌లెట్‌ విక్రయిస్తున్నట్లు తెలిపారు. దీంతో మెడికల్‌ షాపు యజమాని కఠారి పోలయ్యను కూడా అదుపులోకి తీసుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ముఠాలపై నిఘాపెట్టి మత్తు మాత్రల అక్రమ విక్రయాలను అరికడతామని ఒంగోలు వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - Nov 10 , 2026 | 02:28 AM