Share News

శింగరకొండ అభివృద్ధికి ప్రణాళికలు

ABN , Publish Date - Jun 21 , 2026 | 11:16 PM

శింగరకొండను ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేయటంతో పాటు పక్కనే ఉన్న భవనాసి చెరువు ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రత్యేక దృష్టి సారించారు.

శింగరకొండ అభివృద్ధికి ప్రణాళికలు
అభివృద్ది చేయనున్న శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం

పర్యాటక కేంద్రంగా ‘భవనాసి’

ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి రవికుమార్‌

అద్దంకి, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): శింగరకొండను ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేయటంతో పాటు పక్కనే ఉన్న భవనాసి చెరువు ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రత్యేక దృష్టి సారించారు. శింగరకొండ క్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రంగా దినదినాభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు చిట్టడవిలా ఉండే క్షేత్రం నేడు ఉమ్మడి తెలుగు రాష్ర్టాలలో ఉన్న ప్రధాన దేవాలయాలలో ఒకటిగా మారింది. సుమారు రూ.7 కోట్లతో ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం రాతి మండపాన్ని నిర్మించారు. సుమారు రూ.20 కోట్లతో నాలుగు రాజగోపురాలు, ప్రాకారం నిర్మాణానికి దాతలు ముందుకొచ్చారు. గోశాల, కోనేరు నిర్మాణానికి కూడా ప్రణాళికలు రూపొందించారు. శింగరకొండ క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా పరిసర ప్రాంతాలు విశాలంగా మార్చేందుకు ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. ఆధ్మాత్మికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో చెంతనే ఉన్న భవనాసి చెరువు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. చెరువు కట్టపై ఉన్న చిల్లచెట్లు తొలగిస్తున్నారు. మొక్కలు నాటి పార్క్‌గా అభివృద్ధి చేస్తున్నారు. భక్తులు పార్క్‌లో ఆహ్లాదంగా గడిపేందుకు వీలుగా మారుస్తున్నారు. భవనాసి చెరువు కట్టను పార్క్‌గా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో కిందవైపు పంట పొలాల అందాలు, ఆ పక్కనే గుండ్లకమ్మ వంపు సొంపులు పర్యాటకులను మరింత కనువిందు చేయనున్నాయి. భవిష్యత్‌లో భవనాసి చెరువులో బోట్‌ షికారును ఏర్పాటుచేస్తే పర్యాటకులను మరింత ఆకర్షించే అవకాశం ఉంది. దేవాలయంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు జరిగి, భవనాసి చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తే శింగరకొండ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

Updated Date - Jun 21 , 2026 | 11:16 PM