పీజీఆర్‌ఎస్... ముగింపు బోగస్
ABN , Publish Date - Sep 13 , 2026 | 03:09 AM
రాష్ట్రప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ రాజాబాబు తలపెట్టిన ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌లు ప్రహసనంగా మారాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగమంతా క్షేత్రస్థాయికి వచ్చి అర్జీలు తీసుకుంటున్నందున ఇక తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశించారు. దీన్ని కూడా అధికార యంత్రాంగం మొక్కుబడి తంతుగా మార్చేసి ఫేక్ ఎండార్స్‌మెంట్లతో అర్జీలను క్లోజ్ చేస్తున్న తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఫేక్ ఎండార్స్‌మెంట్‌లతో అర్జీలు క్లోజ్?
కుప్పలుతెప్పలుగా రెవెన్యూ సమస్యలు
కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోతున్న బాధితులు
ఒత్తిడితోనే పనులు జరగటం లేదంటున్న సిబ్బంది
రాష్ట్రప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ రాజాబాబు తలపెట్టిన ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌లు ప్రహసనంగా మారాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగమంతా క్షేత్రస్థాయికి వచ్చి అర్జీలు తీసుకుంటున్నందున ఇక తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశించారు. దీన్ని కూడా అధికార యంత్రాంగం మొక్కుబడి తంతుగా మార్చేసి ఫేక్ ఎండార్స్‌మెంట్లతో అర్జీలను క్లోజ్ చేస్తున్న తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వే పుణ్యమా అని భూసమస్య లేని రైతు లేడంటే అతిశయోక్తి కాదన్నట్లుగా పరిస్థితి మారింది. దానికి అధికారులు పరిష్కారం చూపించలేకపోతున్నారు.
కందుకూరు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ప్రతి నియోజకవర్గంలో కనీసం నాలుగుచోట్ల ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) నిర్వహిం చడంతోపాటు ఆ సమస్యలన్నింటినీ రెండు నెలల్లోపు పరిష్కరించాలన్న లక్ష్యంతో కలెక్టర్ రాజాబాబు వాటికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా కందుకూరు నియోజకవర్గంలో మొదటిసారి జూన్ 19న లింగసముద్రంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి 60 అర్జీలు వచ్చాయి. రెండో దఫా కందుకూరులో నిర్వహించిన కార్యక్రమంలో 127 వినతులు అందాయి. మూడో దఫా వలేటివారి పాలెంలో ఏర్పాటు చేసిన పీజీఆర్‌ఎస్‌లో 259 అర్జీలు రావడం విశేషం.నాల్గో విడత గుడ్లూరులో పీజీఆర్‌ఎస్‌ను నిర్వహించకుండా కేవలం పల్లెనిద్రతో ముగించారు. గుడ్లూరులో పీజీఆర్‌ఎస్ జరిగి ఉంటే వీవీపాలెంలో వచ్చిన వాటికి రెట్టింపు అర్జీలు అందే పరిస్థితి ఉంది. ఆయా మండలాల్లో కలెక్టర్ పీజీఆర్‌ఎస్‌లు నిర్వహించినపుప్పడు ప్రతి సచివాలయానికి ఓ జిల్లాస్థాయి అధికారిని పంపి ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిని కూడా పీజీఆర్‌ఎస్‌లో ఇచ్చినట్లే పరిగణిస్తారని చెప్పడంతో వేలాది మంది అక్కడే అర్జీలు సమర్పించారు. అవి ఆన్‌లైన్ కాలేదని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతి సోమవారం స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లలోనూ వందల్లో అర్జీలు వస్తున్నాయి.
పదుల్లోనే పరిశీలన
అధికారులకు అందిన అర్జీలలో పరిష్కరించినవి పదుల్లోనే ఉంటున్నాయి. లింగసముద్రంలో వచ్చిన 60 అర్జీలలో 46 ఎండార్స్‌మెంట్ ద్వారా క్లోజ్ చేశారు. కందుకూరులో వచ్చిన 127 వినతుల్లో 64 పరిష్కరించినట్లు చూపారు. వలేటివారిపాలెం మండలంలో 259 అర్జీలు రాగా కేవలం 13 మాత్రమే క్లోజ్ అయ్యాయి. క్లోజ్ అవడం అంటే సమస్య పరిష్కారం అయినట్లు భావించలేమని, అవన్నీ కేవలం ఎండార్స్‌మెంట్ ద్వారా ముగించినవేనని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. ప్రజలు సమర్పించిన వినతిపత్రంలో చిన్న సాంకేతిక లోపం ఉన్నా, సమస్యకు సంబంధించి అర్జీదారుడు సకాలంలో తగు ఆధారాలు ఇవ్వలేకపోయినా, అధికారులు చెప్పినరోజు అందుబాటులో లేకపోయినా ఎండార్స్‌మెంట్‌తో ఆ అర్జీని క్లోజ్‌చేస్తున్నారు.
ఫేక్ ఎండార్స్‌మెంట్లతో క్లోజ్ చేస్తున్నట్లు విమర్శలు
పీజీఆర్‌ఎస్‌లలో వచ్చే అర్జీలను ఫేక్ ఎండార్స్‌మెంట్లతో అధికారులు క్లోజ్ చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని క్షేత్రస్థాయికి వచ్చి వారి సమస్యను పూర్తిగా పరిష్కరించకుండానే ఓ ఫొటో తీసుకుని అర్జీని ముగిస్తున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరికొందరు అధికారులైతే తెగబడి అర్జీదారుడి స్థానంలో వేరెవరినో నిలబెట్టి ఫొటో తీసి కూడా మమ అనిపిస్తున్నారు. గుడ్లూరు మండలం చేవూరులో ఇటీవల చోటుచేసుకున్న ఓ ఘటన ఈ ఫేక్ ఎండార్స్‌మెంట్లు నిజమేనని నిరూపిస్తోంది. చేవూరుకు చెందిన నూతలపాటి వెంకటప్రసాద్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశారు. ఆ గ్రామ వీఆర్‌వో లంచం ఇవ్వనిదే సర్టిఫికెట్ రాదని తెగేసి చెప్పినట్లు ఆరోపిస్తూ వెంకటప్రసాద్ పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనకు ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్ మంజూరైంది. ఇక్కడ ఫిర్యాదు సర్టిఫికెట్ గురించి కాదు వీఆర్‌వో లంచావతారంపైన. అయితే సర్టిఫికెట్ వచ్చినందున ఇక విచారణ అవసరం లేదని అర్జీదారుడు చెప్పాడు కనుక క్లోజ్ చేస్తున్నట్లు అధికారులు ఫేక్ ఎండార్స్‌మెంట్ ఇచ్చి పరిష్కరించినట్లు పేర్కొన్నారు. అర్జీదారుడికి బదులు ఓ మహిళ ఫొటోను పెట్టి ఎండార్స్‌మెంట్ ఇవ్వడంపై అర్జీదారుడు మళ్లీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇది ఫేక్ ఎండార్స్‌మెంట్లకు నిదర్శనంగా కనిపిస్తోంది.
వేధిస్తున్న సిబ్బంది కొరత
అర్జీలను బుట్టదాఖలు చేయడం, ఫేక్ ఎండార్స్‌మెంట్లతో సమస్య పరిష్కారం కాకుండానే వినతిపత్రాన్ని క్లోజ్ చేయడం లాంటి విన్యాసాలకు సిబ్బంది కొరతే కారణమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. నాలుగు విడతల్లో నిర్వహించిన భూముల రీసర్వే అంతా తప్పులతడక కాగా అవి పరిష్కారం కాకుండానే కొత్త గ్రామాలలో రీసర్వే మొదలుపెట్టడం, వీఆర్‌వోలు, సర్వేయర్లు లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వారు విశ్లేషిస్తున్నారు. వలేటివారిపాలెంలో 15 మంది వీఆర్‌వోలకు గాను ఏడుగురే ఉన్నారు. 15 మంది సర్వేయర్లకుగాను 9మంది మాత్రమే పనిచేస్తున్నారు. రీసర్వే డిప్యూటీ తహసీల్దారు పోస్టు ఖాళీగా ఉంది. ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలో ముగ్గురు వీఆర్‌వోలకు గాను ఒక్కరే ఉన్నారు. బద్దిపూడిలో వీఆర్‌వో పోస్టు కూడా ఖాళీగా ఉంది. సర్వేయర్లు కూడా ఉండాల్సిన సంఖ్య కంటే ముగ్గురు తక్కువగా ఉన్నారు. లింగసముద్రం మండలంలో మండల సర్వేయరు, రీసర్వే డీటీ లేరు. వీఆర్‌వోలు 13మందికి గానూ 9మందే ఉన్నారు. సర్వేయర్లు 13 మందికి ఆరుగురు మాత్రమే పనిచేస్తున్నారు. కందుకూరు మండలంలో ఉండాల్సిన వారి కంటే నలుగురు వీఆర్‌వోలు, ఆరుగురు సర్వేయర్లు తక్కువగా ఉన్నారు. దీంతో ఇద్దరుముగ్గురి పని ఒక్కరే చేయాల్సి వస్తోంది. వీఆర్‌వో ఉంటే సర్వేయరు రాక, సర్వేయరు వస్తే వీఆర్‌వో అందుబాటు లేక వారి మధ్య సమన్వయం కుదరకపోతుండటంతో అర్జీదారులు కాళ్లరిగేలా తిరగడం తప్ప పనులు జరగడం లేదు. ఒక్కరే మూడు నాలుగు గ్రామాలకు బాధ్యులుగా ఉండటంతో ఒక్కచోట కూడా పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతున్నారు. ఈ ఊరివారు అడిగితే ఆ ఊళ్లో ఉన్నానని, వాళ్లు అడిగితే మరో గ్రామాల్లో ఉన్నానని చెప్పుకుంటూ తప్పించుకు తిరుగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారం, ముఖ్యంగా రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహిస్తే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావని రైతులు వాపోతున్నారు.