Share News

ప్రజల సమస్యలు పరిష్కారం కోసమే ‘పీజీఆర్‌ఎస్‌’

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:06 AM

ప్రజల సమస్యలను పరిష్కరించి, వారిలో సంతృప్తి స్థాయిని పెంచడమే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లక్ష్యమని కలెక్టర్‌ పి.రాజాబాబు తెలిపారు.

ప్రజల సమస్యలు పరిష్కారం కోసమే ‘పీజీఆర్‌ఎస్‌’
అర్జీలు తీసుకుంటున్న కలెక్టర్‌ రాజాబాబు, ఎమ్మెల్యే నాగేశ్వరరావు

కలెక్టర్‌ రాజాబాబు

లింగసముద్రంలో నిర్వహించిన పరిష్కార వేదికలో 135 అర్జీలు అందజేసిన ప్రజలు

లింగసముద్రం, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి) : ప్రజల సమస్యలను పరిష్కరించి, వారిలో సంతృప్తి స్థాయిని పెంచడమే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లక్ష్యమని కలెక్టర్‌ పి.రాజాబాబు తెలిపారు. లింగసముద్రంలోని కేఆర్‌ జడ్పీ హైస్కూల్‌ ఆవరణలో నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామస్థాయి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వివిధ సమస్యలపై 135 అర్జీలు వచ్చాయన్నారు. ఎక్కువ శాతం భూ సమస్యలపై అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన అర్జీలపై వచ్చే వారం నాటికి సమగ్ర విచారణ, నివేదికలు సిద్ధం చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. మండలంలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి, సబ్‌ కలెక్టర్‌ దామెర హిమవంశీ, డీఆర్వో మాధురి, డీపీవో వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


సమస్యలపై వచ్చిన అర్జీలు

ఓ వ్యక్తి భూమిని కౌలుకు తీసుకొని ఇప్పుడు తనదంటున్నారని అన్నెబోయినపల్లికి చెందిన జడ దానియేలు అర్జీ అందజేశారు. తన సెటిల్‌మెంటు భూమిని గతంలో నిర్వహించిన రీసర్వేలో ప్రభుత్వ భూమి కింద నమోదు చేశారని శాఖవరం గ్రామానికి చెందిన రూపినేని చిరంజీవి అర్జీ అందజేశారు. తమ సెటిల్‌మెంటు భూమి ఎ 8.16 సెంట్లను రీసర్వేలో మునక భూమి కింద చూపారని చీమలపెంటకు చెందిన చెంచునాయుడు అర్జీ ఇచ్చారు. తమ భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని మొగిలిచెర్లకు చెందిన అంగుళూరి చినకొండయ్య, గంగాడి నరసింహం అర్జీలు ఇచ్చారు. శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని మొగిలిచెర్లకు చెందిన పల్లపోతు వెంగళరావు, అడపా నర్సయ్య, ఎలిపాటి శ్రీనివాసులు అర్జీ ఇచ్చారు. తన తండ్రికి రెండు చోట్ల అస్సైన్‌మెంటు పట్టా ఇచ్చారని, పొలం చూపించలేదని జంపాలవారిపాలేనికి చెందిన మన్నెం జయరామ్‌ అర్జీ ఇచ్చాడు.

Updated Date - Jun 20 , 2026 | 12:06 AM