Share News

పెట్రో షాక్‌

ABN , Publish Date - May 20 , 2026 | 02:32 AM

వాహనదారులకు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్‌ పెట్రోలు, డీజిల్‌పై చమురు సంస్థలు 95పైసలు పెంచాయి. మంగళవారం ఉదయం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.

 పెట్రో షాక్‌

ఇంకోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

నాలుగురోజుల వ్యవధిలో రెండోసారి

లీటర్‌ పెట్రోలు, డీజిల్‌పై 95 పైసలు పెంపు

జిల్లా ప్రజలపై నెలకు రూ.2.40కోట్ల భారం

ఒంగోలు కలెక్టరేట్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): వాహనదారులకు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్‌ పెట్రోలు, డీజిల్‌పై చమురు సంస్థలు 95పైసలు పెంచాయి. మంగళవారం ఉదయం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఈనెల 15న పెట్రోలు, డీజిల్‌ లీటర్‌పై రూ.3కుపైగా పెంచిన చమురు సంస్థలు తాజాగా మరో 95 పైసలు బాదడంతో వాహనదారులతోపాటు ఇతర రంగాలపై భారీగా భారం పడనుంది. జిల్లాలో 197 పెట్రోలు బంకులు ఉన్నాయి. వాటి పరిధిలో రోజుకు 2.94 లక్షల లీటర్ల పెట్రోలు, 5.28 లక్షల లీటర్ల డీజిల్‌ కలిపి 8.22 లక్షల లీటర్ల అమ్మకాలు జరుగుతాయి. అంతకుముందు లీటరు పెట్రోల్‌ ధర రూ.108.62 ఉండగా ఈనెల 15న రూ.111.91కు పెరిగింది. డీజిల్‌ రూ.96.52 నుంచి రూ.99.66కు చేరింది. అలా లీటర్‌కు ఒకేసారి రూ.3కుపైన భారం పడింది.

రవాణా రంగంపై తీవ్ర ప్రభావం

మరోసారి మంగళవారం పెట్రోలు, డీజిల్‌ ధర లీటరుకు 95పైసల చొప్పున ఆయిల్‌ కంపెనీలు పెంచాయి. ఆ ప్రకారం ప్రస్తుతం లీటర్‌ డీజిల్‌ ధర రూ.100.61, పెట్రోల్‌ రూ.112.86కు చేరింది. వినియోగదారులపై రోజుకు రూ.8లక్షలు, నెలకు రూ.2.40కోట్లపైన భారం పడనుంది. డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెంపు తీవ్రప్రభావం చూపనుంది. రవాణా చార్జీలు పెరిగి అన్నిరకాల వస్తువుల ధరలు ఎగబాకే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతు న్నారు. ఇప్పటికే రెక్కలు తొడిగిన నిత్యావసరాల ధరలు చుక్కల్లో చేరనున్నారు. ఇక డీజిల్‌, పెట్రోల్‌పై ఆధారపడిన చిన్న పరిశ్రమలపై కూడా తీవ్ర ప్రభావం చూపి ఆమేర భారం పడనుంది. ఆటోలు, ఇతర రవాణా చార్జీలు పెంచడం అనివార్యంగా కనిపిస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో మళ్లీ డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరుగుతాయన్న ప్రచారం జోరందుకోవడంతో వాహనదారుల్లో మరింత ఆందోళన నెలకొంది.

Updated Date - May 20 , 2026 | 02:40 AM