ముసురు వాన
ABN , Publish Date - Nov 26 , 2026 | 02:42 AM
జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యేకించి తూర్పుప్రాంతంలో ముసురు పట్టింది. రెండు రోజులుగా తెరపి లేకుండా విడతల వారీగా జల్లులు పడుతున్నాయి జిల్లాలో బుధవారం ఉదయానికి 48 గంటల వ్యవధిలో సగటున 27.50 మి.మీ వర్షపాతం నమోదైంది.
జిల్లా అంతటా జల్లులు
రెండురోజుల్లో 27.50 మి.మీ సగటు వర్షపాతం నమోదు
కొన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షం
ఒంగోలులో జనజీవనం అస్తవ్యస్తం
రోడ్లపైనే మురుగు, వర్షపు నీరు
ఒంగోలు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యేకించి తూర్పుప్రాంతంలో ముసురు పట్టింది. రెండు రోజులుగా తెరపి లేకుండా విడతల వారీగా జల్లులు పడుతున్నాయి జిల్లాలో బుధవారం ఉదయానికి 48 గంటల వ్యవధిలో సగటున 27.50 మి.మీ వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో ఆ సమయంలో 30 నుంచి 86 మి.మీకుపైగా వర్షం కురిసింది. ఈనెల ఆరంభం లో మురసు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసిన ప్రాంతంలోనే మళ్లీ ఆ స్థాయిలో వర్షాలు పడటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గ్రామీణ ప్రాంతాల కన్నా ఒంగోలు నగరంలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. రోడ్లపైనే వర్షపు నీరు, మురుగు పారుతూ జనం ఇక్కట్లు పడ్డారు.
ద్రోణి ప్రభావంతో వర్షం
జిల్లాలో మురసు తుఫాన్ అనంతరం దాదా పు మూడు వారాల అనంతరం సోమవారం తెల్లవారుజాము నుంచి వర్షం ప్రారంభమైంది. బుధవారం వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తెరపి లేకుండా విడతల వారీ జల్లులు పడుతూనే ఉన్నాయి. కాగా బుధవారం ఉదయానికి గడిచిన రెండు రోజుల్లో సగటున 27.50 మి.మీ వర్షపాతం నమో దైంది. గరిష్ఠంగా నాగులుప్పలపాడు మండలంలో 86.40 మి.మీ కురిసింది. కొత్తపట్నంలో 84.0, మద్దిపాడులో 58.60, వలేటివారిపాలెంలో 50.40, ఒంగోలు రూరల్‌లో43.20, ఒంగోలు అర్బన్‌లో 43.20, గుడ్లూరులో 37.0, పంగులూరులో 35.0, తాళ్లూరులో 33.60 మి.మీ నమోదైంది. ఇతర మండలాల్లోనూ జల్లులు పడ్డాయి. ఈ వర్షాలు రబీ సాగుకు మేలు చేయనున్నప్పటికీ ఇటీవల మురసు తుఫా న్ తీవ్రంగా ఉన్న ప్రాంతంలో మళ్లీ ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురవడంతో అక్కడ పంటల సాగుకు భూములు ఆరక ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
జనజీవనం అస్తవ్యస్తం
తెరపి లేకుండా విడతల వారీగా జల్లులు పడుతుండటంతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. గ్రామాల్లో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా గ్రామాల్లో ఆ ఎన్నికల ప్రచారం, ఇతర సందడి అధికంగా ఉంది. అలాంటి సమయంలో వర్షాలు కురుస్తుండటం కొంత ఇబ్బందికరంగా మారింది. ఒంగోలు నగరంలో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. నగరమంతా సిమెంట్ రోడ్లు కావడమే కాక చాలాచోట్ల డ్రెయిన్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. రోడ్లు వెడల్పు చేసి డ్రెయిన్ల నిర్మాణాలు పూర్తిచేసిన ప్రాంతాల్లోనూ ఆక్రమణలు పెరిగిపోయాయి. దీంతో పడిన ప్రతి చినుకు కాలువల్లో కన్నా రోడ్లపైనే అధికంగా ప్రవహిస్తోంది. దీనికి మురుగు కూడా తోడవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఇక తెరపి లేకుండా పడుతున్న జల్లులతో చిరు వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు నగరంలో రాకపోకలకు, వ్యాపారాలకు ఇబ్బందిపడ్డారు. ఇదిలా ఉండగా బుధవారం పగటిపూట కూడా ఒంగోలుతోపాటు పలు మండలాల్లో జల్లులు పడ్డాయి.