శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - Jul 26 , 2026 | 03:20 AM
పొగాకు మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు తాత్కాలిక ఉపశమన చర్య లతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. రైతు ప్రయోజనా లకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
రైతు ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యం
పొగాకు సమస్యపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
వ్యాపారులు కలిసి రావాలని సూచన
కేంద్ర ఆదేశాలతో సీఎంను కలిసిన వాణిజ్యశాఖ ఉన్నతాధికారులు
పరిష్కారంపై సాగిన చర్చ
హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు
రేపు మరోసారి సమావేశం
ఒంగోలు, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : పొగాకు మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు తాత్కాలిక ఉపశమన చర్య లతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. రైతు ప్రయోజనా లకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. అందుకోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల తరఫున ఎవరు ఏమి చేయాలి, బోర్డు ద్వారా చర్యలు ఏమిటన్న దానిపై తక్షణ, మీడియం, దీర్ఘకాలిక వ్యూహాలపై సమగ్ర విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. వ్యాపారులతో కూడా మాట్లాడి కార్యాచరణ తయారు చేయాల న్నారు. పొగాకు మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం నివారణ, రైతులకు మెరుగైన ధరల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర మంత్రుల ద్వారా కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్న విషయం విదితమే. స్వయంగా తాను కేంద్ర పెద్దలతో ఈ విషయమై చర్చించడంతోపాటు గత వారం రాష్ట్రప్రభుత్వం తరఫున మంత్రుల బృందాన్ని కూడా ఢిల్లీకి పంపించారు. దీంతో కేంద్రం కూడా ఈ అంశంపై దృష్టి సారించింది.
సీఎంతో కేంద్ర అధికారుల భేటీ
కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి నితిన్‌కుమార్ యాదవ్, డైరెక్టర్ మౌనికా గౌర్‌లు రాష్ట్రానికి వచ్చి సీఎంతో శనివారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర, రాష్ట్రప్రభుత్వం, బోర్డు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పొగాకు పంట అత్యధికంగా ఉమ్మడి జిల్లాలో పండుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి చెందిన మంత్రులు డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయకుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, ఏలూరి సాంబశివరావు తదితరులు హాజరయ్యారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మరోసారి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కేంద్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ సందర్భంగా సమస్య పరిష్కారానికి ఇప్పటివరకు ఆలోచన చేసిన మూడు ప్రతిపాదనలపై కేంద్ర అధికారులు చర్చించారు. అందులో వడ్డీలేని రుణాలు, ధరలో లోటు భర్తీ, ఇతర ప్రోత్సాహకాలను వారు చర్చకు పెట్టగా సాధ్యాసాధ్యాలు, వాటి వల్ల ప్రయోజనం ఏ మేరకు అన్నదానిపై పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడి మరింత మెరుగైన చర్యలను కోరినట్లు సమాచారం.
పొగాకు రైతు నష్టపోకూడదు
ఆయా అంశాలపై సీఎం స్పందిస్తూ తాజా ప్రతిపాదనలపై పూర్తిస్థాయిలో చర్చించాలని సూచించారు. ఏ నిర్ణయం తీసుకున్నా పొగాకు రైతులకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా చూడాలని స్పష్టం చేశారు. శాశ్వత పరిష్కారం కోసం కార్యాచరణ ఉండాలన్న సీఎం.. అంతర్జాతీయ పరిస్థితులు, మార్కెట్‌లో డిమాండ్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వ్యాపారులతో కూడా సంప్రదించి సమగ్ర విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారులతో చర్చించాలని సమావేశంలో ఉన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు సీఎం సూచించారు. తదనుగుణంగా ఈ సమావేశం అనంతరం పెమ్మసాని పర్చువల్‌గా పలు కంపెనీల యజమానులతో చర్చించారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు, పొగాకు బోర్డు ముందుకు వచ్చాయని వ్యాపారులు కూడా ఒక అడుగు ముందుకు వేసి మంచి ప్రతిపాదనలతో ముందుకురావాలని సూచించారు. సోమవారం మరోసారి ఈ అంశంపై సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. సీఎం సమీక్షా సమావేశంలో పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్‌కుమార్, ఈడీ విశ్వశ్రీ పాల్గొనగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇతర మరికొందరు ప్రజాప్రతినిధులు పర్చువల్‌గా పాల్గొన్నారు.