కళాకారులకు అండగా ప్రజా ప్రభుత్వం
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:38 PM
కళాకారులకు ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటోందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చెప్పారు
ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్
నగరంలో కళాకారుల ర్యాలీ
ఒంగోలు కల్చరల్, జులై 12(ఆంధ్రజ్యోతి) : కళాకారులకు ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటోందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చెప్పారు. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలులోని పలువురు కళాకారులు ఎమ్మెల్యే జనార్దన్‌ను కలిసి కళాకారుల సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. ముందు గా సుమారు 100 మంది కళాకారులు నెల్లూరు బస్టాండ్‌లోని బండారు రామారావు, డి.వి.సుబ్బారావు విగ్రహాలకు నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా దామచర్ల నివాసానికి చేరుకున్నారు. కళాకారుల సమస్యలపై ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ త్వరలో ఒంగోలులో ఆడిటోరియం నిర్మాణం చేపడతామని, కళారంగానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించటానికి తాను కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వారు స్థానిక ప్రకాశం భవన్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్దకు వెళ్లి జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బేతంశెట్టి హరిబాబు, అంగలకుర్తి ప్రసాద్, కోశాధికారి ధేనువకొండ సుబ్బయ్య, మాకా ఆంజనేయులు, ఏల్చూరి అనంతలక్ష్మి, పొదిలి బాలగురవయ్య, జనచైతన్య శంకర్, తాళ్లూరి శ్రీదేవి, బేబీ రాణి, బోను దుర్గ, డి.రాజేష్, సూదనగుంట వెంకటేశ్వర్లు, జెర్మియా, జి.వెంకట్రామయ్య, వాకా సంజీవరెడ్డి, కనమాల రాఘవులు, మంద ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.