జగన్‌ను ప్రజలు క్షమించరు!
ABN , Publish Date - Jan 24 , 2026 | 02:35 AM
‘వెలిగొండను పూర్తి చేయాలనే మాట మీరు మాట్లాడుతున్నప్పుడు మీ నాయకుడు జగన్ తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లే! ఎందుకంటే ఆయన ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టును పూర్తి చేశానని, జాతికి అంకితం చేశానని చెప్పారు. ఇప్పుడు మీరు పూర్తి కాలేదని అనడం ఆయన్ను ధిక్కరించినట్టే కదా!’ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అది చీకటి రోజు
వెలిగొండను జాతికి అంకితం ఇవ్వడంపై మంత్రి నిమ్మల
వైసీపీ నాయకులు ఆపార్టీ అధినేత తప్పు చేశారని ఒప్పుకున్నట్లే!
ఆయన్ను ధిక్కరించినట్లేనని వ్యాఖ్య
మార్కాపురం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : ‘వెలిగొండను పూర్తి చేయాలనే మాట మీరు మాట్లాడుతున్నప్పుడు మీ నాయకుడు జగన్ తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లే! ఎందుకంటే ఆయన ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టును పూర్తి చేశానని, జాతికి అంకితం చేశానని చెప్పారు. ఇప్పుడు మీరు పూర్తి కాలేదని అనడం ఆయన్ను ధిక్కరించినట్టే కదా!’ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన వారికి కొన్ని ప్రశ్నలు సంధించారు. శుక్రవారం మంత్రి వెలిగొండ ప్రాజెక్టును సందర్శించారు. పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పూర్తి చేయని ప్రాజెక్టును జాతికి అంకితం అంటూ జగన్ ఈ ప్రాంత ప్రజలను దగా చేసిన ఆ రోజు చీకటిరోజుగా ఆయన అభివర్ణించారు. జగన్ రైతులను కూడా దగ్గరకు రాకుండా బంధించి తన పేరుతో శిలాఫలకం వేసుకుని ఆనందం పొందాడన్నారు. ఉమ్మడి జిల్లా వైసీపీ నేతలు వెలిగొండపై మాట్లాడటం సరికాదన్నారు. ప్రాజెక్టు విషయమై దమ్ముంటే మీ నాయకుడు జగన్‌ను నిలదీసి అడగాలని హితవు పలికారు. ప్రాజెక్టు జాతికి అంకితం పేరుతో ప్రజలను మోసం చేసిన జగన్‌ను వదిలేసి ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత వైసీపీ నాయకులకు లేదని మంత్రి అన్నారు.
వారు ఐదేళ్లలో చేసిన పనులను 50 రోజుల్లో చేశాం
వెలిగొండ టన్నెల్-2లో ఐదేళ్ల వైసీపీ పాలనలో 745 మీటర్ల బెంచింగ్, 705 మీటర్ల లైనింగ్ పనులు మాత్రమే చేసిందని మంత్రి నిమ్మల చెప్పారు. ప్రజా ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లోనే 6,579 మీటర్లు బెంచింగ్, 3,644 మీటర్లు లైనింగ్ పనులు పూర్తి చేశామని చెప్పారు. డిసెంబరులో 504 మీటర్లు, జనవరిలో 312 మీటర్లు లైనింగ్ చొప్పున ఐదేళ్లలో వాళ్లు చేసిన పనిని మేము కేవలం 50 రోజుల్లో చేశామని వెల్లడించారు. ఇదీ ప్రజల పట్ల మా ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి అని స్పష్టం చేశారు. మీకు, మా పనితీరుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న విషయం ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు. టీబీఎం మిషన్ సమస్యపై మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే దానిని టన్నెల్ నుంచి తొలగిస్తామన్నారు. 10 క్యూసెక్కుల నీరు రాగానే తెగిపోయిన ఫీడర్ కాలువకు ఇప్పుడు మేము శంకుస్థాపన చేసి పనులు చేపడుతున్నామని, అయితే వైసీపీ ప్రభుత్వంలోనే వెలిగొండ పూర్తయిందని జాతికి అంకితం చేయడం విడ్డూరమన్నారు. కట్ట నిలవదని అప్పట్లో నిపుణుల కమిటీ చెప్పినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి చూపిందని ధ్వజమెత్తారు. ప్రజా ప్రభుత్వంలో రూ.456 కోట్లతో ఫీడర్ కాలువ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు.
వారంలో సీఎం చంద్రబాబు రాక
మరో వారం రోజుల్లో సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా ప్రాజెక్టు పనులను పరిశీలించి సమీక్ష నిర్వహిస్తారని మంత్రి నిమ్మల చెప్పారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన నిధుల కోసం కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఇటీవల రూ.80 కోట్లు మంజూరు చేశామన్నారు. మిగిలిన పనులు పూర్తి చేసి, నిర్వాసితులకు పరిహారం చెల్లించిన తర్వాతనే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, టీడీపీ వై.పాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, ప్రకాశం, మార్కాపురం జాయింట్ కలెక్టర్లు గోపాలకృష్ణ, శ్రీనివాసులు, ఆర్డీవో శివరామిరెడ్డి, ప్రాజెక్ట్ ఎస్‌ఈ అబూతలీం పాల్గొన్నారు. ఫీడర్ కెనాల్ ఆధునికీకరణ పనుల పరిశీలన నేపథ్యంలో శుక్రవారం మంత్రి నిమ్మల, ఎమ్మెల్యే కందుల, టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు మోటారు సైకిళ్లపై రైడ్ చేస్తూ అందరినీ ఉత్సాహ పరిచారు.