ఒకరోజు ముందుగానే పింఛన్
ABN , Publish Date - Jan 29 , 2026 | 02:38 AM
వచ్చేనెల ఒకటో తేదీ ఆదివారం కావడంతో రాష్ట్రప్రభుత్వం ఈ నెలాఖరులోనే పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 31వ తేదీన ఇటు ప్రకాశం, అటు మార్కాపురం జిల్లాలలోని లబ్ధిదారులకు వేర్వేరుగా పింఛన్లను అందజేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఒకటో తేదీ ఆదివారం కావడంతో 31నే పంపిణీ
ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో వేర్వేరుగా అందజేత
ఒంగోలు నగరం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): వచ్చేనెల ఒకటో తేదీ ఆదివారం కావడంతో రాష్ట్రప్రభుత్వం ఈ నెలాఖరులోనే పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 31వ తేదీన ఇటు ప్రకాశం, అటు మార్కాపురం జిల్లాలలోని లబ్ధిదారులకు వేర్వేరుగా పింఛన్లను అందజేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గతేడాది చివరి రోజునే పింఛన్లను పంపిణీ చేసిన ప్రభుత్వం ఈసారి ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వాల్సి ఉంది. కానీ ఆరోజు ఆదివారం కావడంతో ఈనెల 31నే వీటిని లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయించింది. గతేడాది చివరిరోజైన డిసెంబరు 31న మార్కాపురం. ప్రకాశం జిల్లాలు కలిసి ఉండగా పింఛన్లను ఉమ్మడి జిల్లాగా పంపిణీ చేశారు. జిల్లా విడిపోక ముందుకు మొత్తం 2,84,966 పింఛన్లు ఉన్నాయి. ఇప్పుడు మార్కాపురం విడిపోగా అద్దంకి, కందుకూరు ప్రాంతాలు ప్రకాశంలో కలిశాయి. పింఛన్‌దారుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గురువారం రెండు జిల్లాల పింఛన్ల పూర్తి డేటా జిల్లా కేంద్రాలకు చేరనుంది. రెండు జిల్లాలో ఈనెల 31వ తేదీ శనివారం పింఛన్లను పంపిణీ చేసేందుకు సచివాలయాల సిబ్బంది 30నే బ్యాంకుల నుంచి నగదును డ్రా చేయనున్నారు. శనివారం ఉదయమే ఇంటింటికి తిరిగి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఒక రోజు ముందే పంపిణీ చేయనున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై ఇ ప్పటికే కలెక్టర్ రాజాబాబు ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు ఆడియో కాన్ఫరెన్సు నిర్వహించి పలు సూచనలు చేశారు.