రేపే పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:24 AM
ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెలా ఇస్తున్న పింఛన్లు ఈ నెలలో ఒక రోజు ముందుగానే పంపిణీ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినెలా ఠంఛన్‌గా ఒకటో తేదీనే లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందజేస్తున్నారు.
ఒక రోజు ముందే లబ్ధిదారుల చేతికి డబ్బులు
2న పోలింగ్ నేపథ్యంలో ముందుగా అందజేత
ఒంగోలు నగరం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెలా ఇస్తున్న పింఛన్లు ఈ నెలలో ఒక రోజు ముందుగానే పంపిణీ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినెలా ఠంఛన్‌గా ఒకటో తేదీనే లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందజేస్తున్నారు. ఆరోజు ఆదివారం అయినా, పండుగ వచ్చినా ముందురోజే పంపిణీ చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఇబ్బందిపడకుండా కూటమి ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు ఒకటో తేదీ కంటే ముందుగానే పింఛన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈనెల రెండో తేదీన మూడో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది డిసెంబర్ ఒకటో తేదీనే వారికి కేటాయించిన మండలాలకు వెళ్లి రిపోర్టు చేయాల్సి ఉంది. ఈ కారణంగా ఒకటో తేదీన పింఛన్ సొమ్ము పంపిణీ చేయడం వీలు పడదు. దీంతో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఒకరోజు ముందుగానే ఈనెల 30న ఇంటింటికీ పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆమేరకు జిల్లాలోని వెలుగు డీఆర్‌డీఏ అధికారులకు సెర్ప్ నుంచి ఆదేశాలు అందాయి. జిల్లాలో మొత్తం 2,15,212 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరందరికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.95.05 కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని 30వతేదీనే బ్యాంకులకు జమ చేయనుంది. సచివాలయం సిబ్బంది అదే రోజున బ్యాంకుల నుంచి డ్రా చేసి పంపిణీని చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో 30వతేదీ ఉదయం డబ్బులు డ్రా చేసుకుని మధ్యాహ్నానికి పంపిణీని ప్రారంభించనున్నారు.