Share News

పింఛన్‌ల పంపిణీ నేడే

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:24 AM

రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద బుధవారం సామాజిక పింఛన్లను పంపిణీ చేయనుంది. వివిధ రకాలైన సామాజిక పింఛన్లు పొందుతున్న వారు ప్రకాశం జిల్లాలో 2,18,992 మంది ఉండగా వీరికి పింఛన్‌ సొమ్మును అందజేసేందుకు రాష్ట్రప్రభుత్వం రూ.95.28 కోట్లను విడుదల చేసింది.

పింఛన్‌ల పంపిణీ నేడే

ప్రకాశంలో 2,18,992 మందికి రూ.95.28 కోట్లు విడుదల

మార్కాపురంలో 1,41,580 మంది లబ్ధిదారులకు రూ.63.56 కోట్లు

ఒంగోలు నగరం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద బుధవారం సామాజిక పింఛన్లను పంపిణీ చేయనుంది. వివిధ రకాలైన సామాజిక పింఛన్లు పొందుతున్న వారు ప్రకాశం జిల్లాలో 2,18,992 మంది ఉండగా వీరికి పింఛన్‌ సొమ్మును అందజేసేందుకు రాష్ట్రప్రభుత్వం రూ.95.28 కోట్లను విడుదల చేసింది. మార్కా పురం జిల్లాలో మొత్తం 1,41,580 మంది లబ్ధిదారులు ఉండగా వీరికి అందజేసేందుకు రూ.63.56 కోట్లను ఇ,చ్చింది. ఈ మొత్తం సొమ్మును సచివాలయ సిబ్బంది మంగళవారమే బ్యాంకుల నుంచి డ్రా చేసి పంపిణీ చేసేందుకు సిద్ధం చేసుకున్నారు. ప్రకాశం జిల్లాలో 530 గ్రామ సచివాలయాల్లో ఈ పంపిణీ జరగనుంది. మార్కాపురం జిల్లాలో 373 సచివాలయాల పరిధిలో చేపట్టనున్నారు. పింఛన్ల పంపిణీ చేసే సిబ్బంది బుధవారం ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారుల ఇంటి తలుపుతట్టి సొమ్మను అందజేయనున్నారు. రెండు జిల్లాల్లో ఉన్న శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల పరిధిలో కార్యక్రమంలో భాగస్వాములవుతారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి జరుగుమల్లి మండలం చిరికూరపాడులో పింఛన్‌లు పంపిణీ చేస్తారు. రెండు జిల్లాల్లో బుధవారం పింఛన్ల పంపిణీ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా చూడాలని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్‌ టి.నారాయణస్వామి మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏ ప్రాంతంలో అయినా పంపిణీకి అవాంతరం ఏర్పడితే వెంటనే స్పందించాలని సూచించారు. బుధవారం ఇంటి వద్ద అందుబాటులో లేని లబ్ధిదారులకు గురువారం అందజేయాలన్నారు. గ్రామాల్లో లేని లబ్ధిదారులను ముందుగానే గుర్తించి వారికి ముందుగానే తగిన సమాచారం అందించి బుధవారం అందుబాటులో ఉండేలా చూడాలని గ్రామ స్థాయి అధికారులను కోరారు. బుధవారమే నూరుశాతం పింఛన్ల పంపిణీని పూర్తిచేయాలన్న లక్ష్యంతో అధికారయంత్రాంగం చర్యలు చేపట్టింది.

Updated Date - Apr 01 , 2026 | 01:24 AM