సందడిగా పింఛన్‌ల పంపిణీ
ABN , Publish Date - May 02 , 2026 | 03:22 AM
జిల్లావ్యాప్తంగా శుక్రవారం సామాజిక పింఛన్‌ల పంపిణీ సందడిగా సాగింది. పేదల సేవలో పేరుతో రాష్ట్రప్రభుత్వం ప్రతినెలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో కీలక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారపార్టీకి చెందిన వివిధ స్థాయి నాయకులతోపాటు అధికారులు పాల్గొంటున్నారు.
చెరుకూరులో మంత్రి డాక్టర్ స్వామి, ఒంగోలులో కలెక్టర్ రాజాబాబు హాజరు
పలుచోట్ల పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు, ఉన్నతాధికారులు
ఒంగోలు, మే 1 (ఆంధ్ర జ్యోతి) : జిల్లావ్యాప్తంగా శుక్రవారం సామాజిక పింఛన్‌ల పంపిణీ సందడిగా సాగింది. పేదల సేవలో పేరుతో రాష్ట్రప్రభుత్వం ప్రతినెలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో కీలక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారపార్టీకి చెందిన వివిధ స్థాయి నాయకులతోపాటు అధికారులు పాల్గొంటున్నారు. అలాగే ఈ విడత కూడా ఆయా ప్రాంతాల్లో వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు, నేతలు, అధికార యంత్రాంగం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్మును అందించారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పంపిణీ ప్రధాన బాధ్యత కలిగిన సచివాలయ సిబ్బంది చాలాచోట్ల ఉదయం ఆరు గంట లకే పింఛన్‌ల అందజేత ప్రారంభించారు. జిల్లాలో వృద్ధులు, వితంతువులు, దివ్యాం గులు, ఇతర పలురకాల సామాజిక పింఛన్ల లబ్ధిదారులు మొత్తం 2,18,621 మంది ఉండ గా వారికి రూ.191.06 కోట్లు మంజూరైంది. వారిలో 75శాతం మందికి ఉదయం 11గం టలకే అందజేశారు. తిరిగి సాయంత్రం మిగిలిన వారికి ఇచ్చారు. అలా సాయంత్రం ఐదు గంటలకు సుమారు 90శాతం మంది లబ్ధిదారులకు పింఛన్‌ను అందజేశారు. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ స్వామి తన నియోజకవర్గంలోని పొన్నలూరు మండలం చెరుకూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఇంటింటికి వెళ్లి అందజేత..
కలెక్టర్ రాజాబాబు ఒంగోలు నగరంలోని రామనగర్ మూడో లైనులో అక్కడి సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్మును అందజేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నగరంలోని 29వ డివిజన్ పరిధిలో ఉన్న కొణిజేడు బస్టాండు ఏరియాలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ ఎన్‌జీపాడు మండలం ఈదుమూడి, మాచవరం గ్రామాల్లో పాల్గొన్నారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు మండలం దొండపాడులో పింఛన్‌లు పంపిణీ చేశారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో, టీడీపీ దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తాళ్లూరు మండలం తురకపాలెంలో, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు దర్శిలో పింఛన్లు పంపిణీ చేశారు. అద్దంకి నియోజకవర్గానికి చెందిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన కార్యక్రమాలకు హాజరు కాగా నియోజకవర్గంలో స్థానిక నేతలు, అధికారులు పంపిణీ చేశారు. అలాగే జిల్లావ్యాప్తంగా పింఛన్‌లను సిబ్బందితో కలిసి స్థానిక నేతలు అందజేశారు.