ఉత్సాహంగా పింఛన్‌ల పంపిణీ
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:10 AM
జిల్లావ్యాప్తంగా బుధవారం సామాజిక పింఛన్‌ల పంపిణీ ఉత్సాహంగా సాగింది. ఉదయం 6.30 గంటల నుంచే స్వర్ణగ్రామ, స్వర్ణవార్డుల సిబ్బంది ఆయాప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు నగదును అందజేశారు.
కట్టుబడివారిపాలెంలో మంత్రి డాక్టర్ స్వామి,
కొమ్మినే నివారిపాలెంలో గొట్టిపాటి హాజరు
పలు ఇతరచోట్ల కీలక ప్రజాప్రతినిధులు,
ముఖ్య అధికారులు అందజేత
ఒంగోలు, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా బుధవారం సామాజిక పింఛన్‌ల పంపిణీ ఉత్సాహంగా సాగింది. ఉదయం 6.30 గంటల నుంచే స్వర్ణగ్రామ, స్వర్ణవార్డుల సిబ్బంది ఆయాప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు నగదును అందజేశారు. జూలై నెలకు సంబంధించి జిల్లాలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఇతర పలువర్గాలకు చెందిన 2,17,573 మంది లబ్ధిదారులకు రూ.94.82 కోట్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులలో దాదాపు 60శాతం మంది వృద్ధులే కావడంతో కూటమి ప్రభుత్వం ఇంటింటికీ వెళ్లి అందజేయాలని నిర్ణయించింది. తదనుగుణంగా సిబ్బంది ఉదయం ఆరు గంటల నుంచే పంపిణీ ప్రారంభించి పది గంటల కల్లా మూడొంతుల మందికి నగదు అందజేశారు. అలాగే సాయంత్రం ఐదు గంటల కల్లా 90శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తిచేశారు. మొత్తం 2.17లక్షల మంది లబ్ధిదారులలలో ఆ సమయానికి 1.96 లక్షల మందికి రూ.84.80 కోట్లు అందజేశారు. మంత్రుల నుంచి గ్రామస్థాయిలోని కూటమి నాయకుల వరకు, అలాగే వివిధ స్థాయిల్లోని అధికారులు కూడా ఈ కార్యక్రమంలో భాగాస్వామ్యులు కావాలని ఆదేశించింది. పేదల సేవలో పేరుతో దీనిని నిర్వహిస్తున్నారు.
పింఛన్లు ఇచ్చిన మంత్రులు
పింఛన్‌ల పంపిణీ కార్యక్రమంలో కీలక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ స్వామి కొండపి మండలం కట్టుబడివారిపాలెంలో ఇంటింటికి తిరిగి లబ్ధిదారులను కలిసి వారిని పరామర్శించి పింఛన్లు అందజేశారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బల్లికురవ మండలం కొమ్మినేనివారిపాలెంలో పంపిణీ చేశారు. మద్దిపాడు మండలం ఘడియపూడిలో బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. లింగసముద్రం మండలం రామకృష్ణాపురంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పింఛన్‌లను అందజేశారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముండ్లమూరు మండలం చంద్రగిరిలో పంపిణీ చేయగా మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు దర్శిలో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి ఒంగోలు నగరంలో పాల్గొన్నారు. పలు ఇతరచోట్ల అధికారులు, వివిధ స్థాయిల్లోని కూటమి నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.