నిలిచిన మరమ్మతులు
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:05 AM
మండల పరిధిలో వలపర్ల గ్రామంలోని ఎస్సీ బాలుర వసతిగృహంలో మరమ్మతుల నిమిత్తం గత ఏడాది సోషల్ వెల్పేర్ నిధులు రూ. 28 లక్షలు మంజూర య్యాయి.
మార్టూరు, జనవరి22 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలో వలపర్ల గ్రామంలోని ఎస్సీ బాలుర వసతిగృహంలో మరమ్మతుల నిమిత్తం గత ఏడాది సోషల్ వెల్పేర్ నిధులు రూ. 28 లక్షలు మంజూర య్యాయి. టెండరు ద్వారా ఈ పనులను పొందిన కాంట్రాక్టర్ వసతిగృహంలో కేవలం నాలుగవ వంతు పనులను కూడా పూర్తి చేయలేదు. పనులను మధ్యలోనే ఆపేశారు. విద్యార్థులు నిద్రించే ఒకగదిపై కప్పు శ్లాబును తొలగించారు. మరల కొత్తగా పై కప్పుకు శ్లాబును వేస్తామన్నారు. కానీ శ్లాబును తొలగించి దాదాపుగా రెండు నెలలు కావస్తున్నా, కొత్తగా శ్లాబు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. కాంట్రాక్టరు ఈ వైపు రావడమే మానేశారని హాస్టల్ వార్డెన్, విద్యార్థులు చెబుతున్నారు. ఈ హాస్టల్‌లో 50 మంది విద్యార్థులున్నారు. కేవలం రెండు మరుగుదొడ్లుతోనే విద్యార్థులు అవసరాలు తీర్చుకుంటున్నారు. అదీగాక ఒక గదిలో పైకప్పు శ్లాబు బీటలు వారింది. ఇంకా కొన్ని గదులలో విద్యుత్ సమస్యలు ఉన్నాయి. ఫ్లోరింగ్ బాగా లేదు. మంచినీటి సమస్య ఉంది. దీంతో హాస్టల్‌లో సమస్యలను తీర్చడానికి, వసతులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూ.28 లక్షలను మంజూరు చేసింది. టెండరు పొందిన వ్యక్తి హాస్టల్‌లో రెండు మరుగుదొడ్లుకు తలుపులను పెట్టించాడు, కొంత ఫ్లోరింగ్ చేయించాడు .కాని తర్వాత ఆయన పనులను అర్ధాంతరంగా ఆపివేశాడు. ఆగిపోయిన పనులను ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వసతిగృహంలో మరుగుదొడ్లు సక్రమంగా లేవు. దీంతో ఆరుబయటకు బహిర్భూమికి వెళుతున్నారు. అయితే హాస్టల్‌లో మరమ్మతు పనులు జరుగుతుండడంతో విద్యార్థులు ఆనందంగా ఉన్నారు. కానీ పనులను ఆపివేయడంతో వాటిని ఎప్పుడు పూర్తిచేస్తారా అని విద్యార్దులు అడుగుతున్నా సమాదానం చెప్పేవారు లేరు. ఈ విషయమె గురువారం ఏఈ షేక్ హుస్సేన్‌ను వివరణ కోరగా కాంట్రాక్టరు బిల్లులు రావడంలేదని, స్థానికంగా కొన్ని సమస్యలు కారణంగా పనులు నిలిపేశాడన్నారు. దీంతో మరోసారి రీటెండరు పిలిచామన్నారు. కొత్తగా టెండరు పొందిన కాంట్రాక్టరు ద్వారా హాస్టల్ లో పనులను పూర్తిచేయిస్తామన్నారు.