Share News

లాభాల బాటలో పీడీసీసీ బ్యాంకు

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:08 AM

పీడీసీసీ బ్యాంకు లాభాల బాటలో పయనిస్తోందని, బ్యాంకు చైర్మన్‌గా తాను బాధ్యతలు స్వీకరించిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.13 కోట్లు నిఖర లాభాన్ని ఆర్జించినట్లు బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్య చెప్పారు.

లాభాల బాటలో పీడీసీసీ బ్యాంకు

గత ఆర్థిక సంవత్సరంలో నిఖర లాభం రూ.13 కోట్లు

బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ సీతారామయ్య

ఒంగోలు, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : పీడీసీసీ బ్యాంకు లాభాల బాటలో పయనిస్తోందని, బ్యాంకు చైర్మన్‌గా తాను బాధ్యతలు స్వీకరించిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.13 కోట్లు నిఖర లాభాన్ని ఆర్జించినట్లు బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్య చెప్పారు. స్థానిక బ్యాంకు కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాదిలో బ్యాంకు సాధించిన ప్రగతిని వివరించారు. గత ఏడాది కాలంలో బ్యాంకులో రూ.134.12 కోట్లు డిపాజిట్లు సేకరించామన్నారు. రూ.528.61 కోట్లు రుణాలు అండ్‌ అడ్వాన్స్‌లు పెంచడంతో పాటు మొత్తం బ్యాంకు వ్యాపారాన్ని రూ.662.73 కోట్లుపెంచినట్లు తెలిపారు. గత ఏడాదిలో నిరర్ధక ఆస్తులను రూ.15.74 కోట్లకు తగ్గించామన్నారు. 15శాతం వృద్ధిరేటుతో బ్యాంకు వ్యాపారాభివృద్దిలో ముందుకు దూసుకుపోతోందని చెప్పారు. రికార్డులన్నింటినీ డిజిటలీకరణ చేసి ప్రస్తుతం కేవలం ఈ ఆఫీసు ద్వారానే ఫైళ్లు నడిచే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. బ్యాంకు అధికారులు, సిబ్బంది హాజరులో పారదర్శకత కోసం డిజిటలీకరించి ప్రస్తుతం ముఖ హాజరును అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్‌ సేవలను విస్తరించేందుకు కొత్తగా ఐదు బ్యాంకులు ప్రారంభానికి ఆర్‌బీఐ అనుమతి పొందినట్లు చెప్పారు. కొత్తపట్నం, ముప్పవరం, వెలిగండ్ల, కొప్పెరపాడు, లింగసముద్రంలలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బ్యాంకు ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే నెలలో బ్యాంకు భవన నవీకరణ పనులు పూర్తి కాగానే భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో వ్యాపార లక్ష్యాలను కూడా చైర్మన్‌ వివరించారు. బ్యాంకు డిపాజిట్లు రూ.1400 కోట్లకు పెంచాలని, రుణ పంపిణీని రూ.3800 కోట్లకు, వ్యాపారాన్ని రూ.5200 కోట్లకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. బ్యాంకులో పేరుకపోయిన పాత బకాయిల వసూళ్లకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని సీతారామయ్య తెలిపారు.

దుష్ప్రచారం చేస్తే క్రిమినల్‌ చర్యలు

బ్యాంకు ప్రగతిని గిట్టని కొందరు బ్యాంకుపై దుష్ప్రచారం చేస్తున్నారని, అటువంటి వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడేది లేదని డాక్టర్‌ సీతారామయ్య హెచ్చరించారు. రిటైర్డ్‌ ఉద్యోగులు, మాజీ చైర్మన్లు కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవరి గురించి పట్టించుకోకుండా బ్యాంకు అబివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో బ్యాంకు సీఈవో లక్ష్మీనరసింహనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 12:08 AM