పాస్టర్ పురుషోత్తం అరెస్ట్
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:28 PM
నగదు రెట్టింపు చేసి ఇస్తానని ప్రజల్ని మోసం చేసి భారీ మొత్తంలో నగదు మోసాలకు పాల్పడిన పాస్టర్ పురుషోత్తంను అరెస్ట్ చేసినట్లు ఇన్‌చార్జి డీఎ్‌సపీ పీ శ్రీధర్ తెలిపారు.
ఆయనపై 4 పోలీ్‌సస్టేషన్‌లలో కేసులు నమోదు
రూ.13.28 లక్షల నగదు స్వాధీనం
రూ.31.70లక్షల బ్యాంకు నిల్వలు సీజ్
మోసంలో ప్రమేయం ఉన్న మరో ఐదుగురు కుటుంబ సభ్యులూ
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎ్‌సపీ శ్రీధర్
కనిగిరి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : నగదు రెట్టింపు చేసి ఇస్తానని ప్రజల్ని మోసం చేసి భారీ మొత్తంలో నగదు మోసాలకు పాల్పడిన పాస్టర్ పురుషోత్తంను అరెస్ట్ చేసినట్లు ఇన్‌చార్జి డీఎ్‌సపీ పీ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. కనిగిరి పట్టణంలోని రాజీవ్‌కాలనీలో నివసిస్తున్న పాస్టర్ వంగేపురం పురుషోత్తం, ఆయన భార్య నిర్మల, ముగ్గురు కుమారులైన సుకుమార్, నవీన్, దానియేలుతో పాటు పాస్టర్‌కు వరుసకు చెల్లెలైన రాంపంగు కాంతమ్మలు ఓ ముఠాగా ఏర్పడ్డారు. అమాయక ప్రజలను మోసం చేసి వారి నుంచి అక్రమంగా డిపాజిట్ల రూపంలో నగదు వసూలు చేశారు. వసూలు చేసిన నగదుకు 15రోజుల్లో రెండింతలు ఇస్తామని చెప్పి నమ్మించారు. ఈ విధమైన ప్రచారాన్ని ప్రజల్లో రేకెత్తించి పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడ్డారు. ఈ మేరకు నిందితులపై నియోజకవర్గంలోని పీసీపల్లి, హనుమంతునిపాడు, కనిగిరి, మర్రిపూడి మండలాల స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. కొండపి నియోజకవర్గ పరిధిలోని వేమవరం గ్రామానికి చెందిన బాధితుడు గుదే శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు డీఎ్‌సపీ తెలిపారు. మోసాలకు పాల్పడిన నిందితుడు పాస్టర్ పురుషోత్తంను అదుపులోకి తీసుకుని విచారించామని, ఆయన వద్ద రూ.13.28 లక్షల నగదు, ప్రింటర్‌ను, స్టాంప్‌లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. వాటితో పాటు పాస్టర్ కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల్లోని రూ.31.70లక్షల రూపాయలను సీజ్ చేసినట్లు చెప్పారు.
మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు
ఇన్‌చార్జి డీఎ్‌సపీ శ్రీధర్
ప్రజలను మభ్యపెట్టి, అధిక లాభాలు వస్తాయని నమ్మించి డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి డీఎ్‌సపీ శ్రీధర్ హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు, సంస్థల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు డబ్బుల బదిలీ చేయకుండా, మోసానికి గురైన వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు. అదేవిధంగా పాస్టర్ పురుషోత్తం చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే వారు స్వచ్ఛందంగా తగిన పత్రాలు, ఆధారాలతో వస్తే వారికి న్యాయం జరిగేలా చూస్తామని డీఎ్‌సపీ చెప్పారు. మనీ స్కాం కేసును ఛేదించటంలో కృషి చేసిన సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐలు సందీప్, రాజ్‌కుమార్, నరసింహారావులను డీఎ్‌సపీ అభినందించారు.