Share News

పాక్షికంగా రికార్డుల అందజేత

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:02 AM

కోల్‌ సొసైటీపై సెక్షన్‌ 52 విచారణలో మరో అడుగు ముందుకు పడింది. విచారణాధికారి కోరిన రికార్డులను పూర్తిస్థాయిలో కాకపోయినా పాక్షికంగా ఆ సంస్థ ప్రస్తుత బిజినెస్‌ మేనేజర్‌ అందజేశారు. మిగిలిన వాటిని ఈనెల 4న అందజేస్తామంటూ లిఖితపూర్వకంగా విచారణాధికారికి నివేదించారు.

పాక్షికంగా రికార్డుల అందజేత
కొన్ని రికార్డులను బిజినెస్‌ మేనేజర్‌ నుంచి స్వాధీనం చేసుకుంటున్న విచారణాధికారి సురేంద్రబాబు

కోల్‌సొసైటీ విచారణలో మరో అడుగు

మిగిలినవి రేపే ఇచ్చేలా బిజినెస్‌ మేనేజర్‌ లిఖితపూర్వకంగా వివరణ

ఒంగోలు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): కోల్‌ సొసైటీపై సెక్షన్‌ 52 విచారణలో మరో అడుగు ముందుకు పడింది. విచారణాధికారి కోరిన రికార్డులను పూర్తిస్థాయిలో కాకపోయినా పాక్షికంగా ఆ సంస్థ ప్రస్తుత బిజినెస్‌ మేనేజర్‌ అందజేశారు. మిగిలిన వాటిని ఈనెల 4న అందజేస్తామంటూ లిఖితపూర్వకంగా విచారణాధికారికి నివేదించారు. ఒంగోలు కేంద్రంగా నడుస్తున్న కోల్‌సొసైటీలో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకోవడంతోపాటు అసలు పాలకవర్గం ఎన్నికే నిబంధనలకు విరు ద్ధమని, బోగస్‌ పాలకవర్గం నడుస్తున్నదని హైకో ర్టులో పిటిషన్‌ వేసిన విషయం విదితమే. కోర్టు సంబంధిత అధికారులకు నోటీసులు ఇవ్వడంతో సహకార శాఖ అధికారులు అప్పటికే తమకు అంది న ఫిర్యాదుల ఆధారంగా విచారణకు ఆదేశించారు. దీంతో ఒంగోలు డీఎల్‌సీవో కార్యాలయంలోని అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ నర్రా సురేంద్రబాబును విచారణాధికారిగా నియమిస్తూ సెక్షన్‌ 52 విచారణకు డీసీవో శ్రీలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో విచారణను ప్రారంభించిన సురేంద్రబాబు కోల్‌ సొసైటీ రికార్డులను తనకు స్వాధీనం చేయాలని గతనెల 27న ప్రస్తుత పాలకమండలి అధ్యక్షుడు, బిజినెస్‌ మేనేజర్‌లకు నోటీసులు ఇచ్చారు. ప్రధానంగా 2018-19 నుంచి కోల్‌ సొసైటీకి సంబంధించి చేసిన తీర్మానాలు, ఆర్థిక లావాదేవీలు, లీజు అగ్రిమెంట్లు తదితర పలు అంశాలకు సంబంధించిన రికార్డులను వారంలోపు అందజేయాలని పేర్కొన్నారు. తదనుగుణంగా రికార్డుల స్వాధీనం కోసం విచారణాధికారైన సురేంద్రబాబు సోమవారం ఉదయం తన సిబ్బందితో కోల్‌ సొసైటీ కార్యాలయానికి వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు వారు వాటి కోసం వేచి ఉండగా బిజినెస్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న చక్రవర్తి తొలుత కొంత గడువును కోరినట్లు సమాచారం. అందుకు విచారణాధికారి అంగీకరించకపోవడంతో మినిట్స్‌ పుస్తకం, నగదు పుస్తకం రెండేళ్లకు సంబంధించినవి అందజేసి మిగిలినవి ఈనెల 4న ఇస్తామని లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు సమాచారం. అలా పాక్షికంగా రికార్డులు స్వాధీనం చేసుకున్న విచారణాధికారి తాను కోరిన అన్ని రికార్డులను 4న ఇవ్వాలని, లేనిపక్షంలో పోలీస్‌ కేసు నమోదు తప్పదని స్పష్టం చేసి వెనుతిరిగినట్లు తెలిసింది. మొత్తం మీద పాక్షికంగానైనా కొన్ని రికార్డులు స్వాధీనంతో కోల్‌ సొసైటీ విచారణలో మరో అడుగు ముందుకు పడినట్లు అయింది.

Updated Date - Feb 03 , 2026 | 03:02 AM