Share News

ప్రశాంతంగా పరిషత్‌ నామినేషన్లు

ABN , Publish Date - Oct 22 , 2026 | 03:27 AM

పరిషత్‌ ఎన్నికల్లో మొదటి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ బుధవారం జిల్లాలో ప్రారంభమైంది. ఒంగోలులోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీటీసీ సభ్యులకు నామినేషన్లను జడ్పీ సీఈవో, రిటర్నింగ్‌ అధికారైన బి.చిరంజీవి ఆధ్వర్యంలో స్వీకరించారు.

ప్రశాంతంగా పరిషత్‌ నామినేషన్లు
మద్దిపాడులోని నామినేషన్‌ కేంద్రంలో సిబ్బందికి సూచనలు ఇస్తున్న కలెక్టర్‌ రాజాబాబు

జిల్లాలో అక్కడక్కడా కొద్దిపాటి వివాదాలు

13 జడ్పీటీసీ, 140 ఎంపీటీసీ స్థానాలకు దాఖలు

కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు కలెక్టరేట్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : పరిషత్‌ ఎన్నికల్లో మొదటి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ బుధవారం జిల్లాలో ప్రారంభమైంది. ఒంగోలులోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీటీసీ సభ్యులకు నామినేషన్లను జడ్పీ సీఈవో, రిటర్నింగ్‌ అధికారైన బి.చిరంజీవి ఆధ్వర్యంలో స్వీకరించారు. మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాల యాల్లో ఎంపీటీసీ స్థానాలకు రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లు తీసుకున్నారు. జిల్లాలో 27 మండలాల పరిధిలో 27 జడ్పీటీసీ స్థానాలు, 373 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో 9 మండలాలకు చెందిన 13 మంది అభ్యర్థులు జడ్పీటీసీ స్థానాలకు నామినే షన్లు దాఖలు చేశారు. కురిచేడు, తాళ్లూరు, దొనకొండ, టంగుటూరు, జరుగుమల్లి, కొండపి, ఉలవపాడు, ముండ్లమూరు, లింగసముద్రం మండలాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. జిల్లాలో 373 ఎంపీటీసీ స్థానాలు ఉండగా బుధవారం 140 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ల సందర్భంగా జిల్లాలో అక్కడక్కడా కొద్దిపాటి స్వల్ప వివాదాలు మినహా ప్రశాంతంగా ప్రక్రియ కొనసాగింది.

ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్‌

కలెక్టర్‌ రాజాబాబు జిల్లాలోని పలు మండలాల్లో నామినేషన్ల కేంద్రాలను పరిశీలించారు. ఒంగోలులోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మద్దిపాడు, తాళ్ళూరు, ముండ్లమూరు మండలాల్లో ఎంపీటీసీ నామినేషన్లను పరిశీలించారు. అక్కడి రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా ఆయా కార్యాలయాల వద్ద భారీ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేంద్రాలకు వంద మీటర్ల దూరంలోనే వాహనాలను నిలుపుదల చేశారు. జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్ద వంద మీటర్ల దూరంలోతనిఖీలు చేసిన తర్వాత లోపలికి పోలీసులు అనుమతించారు.

Updated Date - Oct 22 , 2026 | 03:27 AM