ప్రశాంత వాతావరణంలో పరిషత్ ఎన్నికలు
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:34 PM
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా పరిషత్ సీఈవో బి.చిరంజీవి వెల్లడించారు.
వచ్చే నెల 5వ తేదీన పోలింగ్
రెండు ఏకగ్రీవంకాగా, మిగిలిన 25 జడ్పీటీసీ స్థానాలకు ఎలక్షన్
220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
సమస్యాత్మక, తీవ్రసమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
జడ్పీ సీఈవో చిరంజీవి వెల్లడి
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా పరిషత్ సీఈవో బి.చిరంజీవి వెల్లడించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అన్నిశాఖల సమన్వయంతో సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా పరిషత్ ఎన్నికలు ఈనెల 5వ తేదీకి మార్చినట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఆ తర్వాత ఓటు వేసేందుకు క్యూలో ఉండే ఓటర్లందరికీ ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్లిప్పులు ఇస్తామని చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే 6వ తేదీన రీపోలింగ్ జరుగుతుందన్నారు. 7వ తేదీన ఓట్లను లెక్కిస్తామని చెప్పారు. జిల్లాలో 27 జడ్పీటీసీలు ఉండగా మర్రిపూడి, పొన్నలూరు ఏకగ్రీవం కాగా 25 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. వీటి పరిధిలో 96 మంది అభ్యర్థులు బరిలో ఉండగా టీడీపీ నుంచి 22 మంది, వైసీపీ నుంచి 25 మంది, బీఎస్పీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, జనసేన నుంచి ముగ్గురు, సీపీఐ, సీపీఎం తరఫున ముగ్గురు చొప్పున, మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారని వివరించారు.
ఎంపీటీసీ స్థానాలకు 599 మంది పోటీ
జిల్లాలో 371 ఎంపీటీసీ స్థానాలకు 151 స్థానాలు ఏకగ్రీవం కాగా 220 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఐదు మండలాల్లోని ఎంపీటీసీలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. ఈ ఏకగ్రీవ స్థానాల్లో 143 మంది టీడీపీ, ఐదుగురు జనసేన, వైసీపీకి చెందిన ఇద్దరు, మరొకరు స్వతంత్ర అభ్యర్థి ఉన్నారన్నారు. మిగిలిన 220 ఎంపీటీసీ స్థానాలకు 599 మంది పోటీలో ఉండగా వైసీపీ నుంచి 211 మంది, టీడీపీ నుంచి 210 మంది, జనసేన నుంచి 25 మంది, సీపీఎం నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, బీఎస్పీ నుంచి ముగ్గురు, బీజేపీ, సీపీఐ నుంచి ఒకరేసి బరిలో ఉన్నారన్నారు.
130 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా
జిల్లా వ్యాప్తంగా 1,265 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 130 కేంద్రాలు, సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. ఈ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాను 84 జోన్లు, 144 రూట్లుగా విభజించి ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల ద్వారా పోలింగ్ సిబ్బందిని నవంబరు 4న సాయంత్రానికే వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలను చేరుస్తామని చెప్పారు. జేసీ కల్పనాకుమారి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈసారి కౌంటింగ్ కేంద్రాల వికేంద్రీకరణ కాకుండా ఒంగోలులోని రైజ్ కాలేజీ, పేస్ కాలేజీల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొండపి, కందుకూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల పరిధిలోని మండలాల ఓట్ల లెక్కింపు రైజ్ కాలేజీలో, దర్శి, అద్దంకి, ఒంగోలు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేశామని చిరంజీవి తెలిపారు.