Share News

పంచాయతీ పోరుకు రెడీ

ABN , Publish Date - Nov 10 , 2026 | 02:33 AM

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో 27 మండలాలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొద టి విడతకు ఈ నెల 13న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

పంచాయతీ పోరుకు రెడీ

13న తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌

10వేల జనాభా ఉంటే అక్కడేనామినేషన్లు

అంత జనాభా కంటే తక్కువ ఉంటే

రెండు, మూడింటికి కలిపి ఒకేచోట స్వీకరణ

కలెక్టర్‌ ఆదేశాలతో కదిలిన అధికారులు

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో 27 మండలాలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొద టి విడతకు ఈ నెల 13న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఈ నేపథ్యం లో నామినేషన్ల స్వీకరణ, పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణ, ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్‌ ఆఫీసర్ల నియామకం, డివిజన్ల వారీగా పంచాయతీలకు పోలింగ్‌ సిబ్బంది, బ్యాలెట్‌ పత్రాలు, ఇతర మెటీరియల్‌ తరలింపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మునిసిపల్‌, పరిషత్‌ ఎన్నికలను పూర్తిచేసిన యంత్రాంగం పంచాయతీ పోరుకు సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్‌ రాజాబాబు ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారి అనుపమ నేతృత్వంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలను ప్రారంభించారు.

డివిజన్ల వారీగా పోలింగ్‌

జిల్లాలో 515 గ్రామ పంచాయతీలు, 5,166 వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ కోసం 5,236 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మూడు డివిజన్లు ఉండగా డివిజన్ల వారీగా ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత పోలింగ్‌ కందుకూరు డివిజన్‌ పరిధిలోని 137 గ్రామ పంచాయతీలకు ఈనెల 26వ తేదీన నిర్వహిస్తారు. రెండో విడత ఈనెల 29న ఒంగోలు డివిజన్‌లో 180 పంచాయతీలకు నిర్వహిస్తారు. వచ్చేనెల 2న అద్దంకి డివిజన్‌లోని 198 గ్రామపంచాయతీలకు ఎన్నికలకు జరగనున్నాయి.

ఓటర్ల ప్రాతిపదికన ఏర్పాట్లు

గ్రామ పంచాయతీల ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అవసరమైన చర్యలు ప్రారంభించారు. ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం 10వేల ఓటర్లు ఉంటే ఆ పంచాయతీలోనే నామినేషన్లు స్వీకరించనున్నారు. 10వేలకు తక్కువ ఓటర్లు ఉంటే రెండు పంచాయతీలకు కలిపి ఒకేచోట నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఆ విధంగా జిల్లాలో నామినేషన్లు స్వీకరణకు ఆయా పంచాయతీల జనాభా ప్రతిపాదికన ఆర్వోలను నియమించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

Updated Date - Nov 10 , 2026 | 02:33 AM