Share News

ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే పల్లెనిద్ర

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:21 AM

ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకొని సత్వరమే పరిష్కరించేందుకు రాష్ట్రప్రభుత్వం పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని కలెక్టర్‌ పి. రాజాబాబు తెలిపారు.

ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే పల్లెనిద్ర
పోతవరంలో పల్లెనిద్ర కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ రాజాబాబు, పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, అధికారులు

సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలి : కలెక్టర్‌ రాజాబాబు

దర్శి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి) : ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకొని సత్వరమే పరిష్కరించేందుకు రాష్ట్రప్రభుత్వం పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని కలెక్టర్‌ పి. రాజాబాబు తెలిపారు. మండలంలోని పోతవరం గ్రామంలో శుక్రవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన రచ్చబండలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారులు చేసే పనిపట్ల ప్రజలు ఎంతమేరకు సంతృప్తి చెందుతున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ బృహత్తర కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. జిల్లాలోని అధికారులను ఈకార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్నీ గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అర్హులైన అందరికీ అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. జిల్లాలో ప్రప్రథమంగా పోతవరంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని ఆరంభించటం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు, విద్యార్థులు, మహిళలు నిర్భయంగా సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. నిబంధనలకు అనుగుణంగా తక్షణమే పరిష్కరించటం జరుగుతుందన్నారు.

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్ష్యంగా తెలుసుకునేందుకు పల్లెనిద్ర కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సమస్యలు పరిష్కరించటంతోపాటు గ్రామాల అభివృద్ధికి కృషిచేసి సుపరిపాలన అందించటమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఆరంభించిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సారథ్యంలో నడుస్తున్న ప్రజాప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు, సుపరిపాలనకు అద్దంపడుతున్నాయన్నారు. వెనుకబడిన దర్శి నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నేత డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌, అద్దంకి ఆర్డీవో పి.జాన్సన్‌, డీపీవో వెంకటేశ్వరరావు, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ జోస్‌ఫకుమార్‌, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, దర్శి తహసీల్దార్‌ ఎం.శ్రావణ్‌కుమార్‌, జిల్లాలోని వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.


హైస్కూల్లో మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయాలి

- అక్షర, విద్యార్థిని

స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో మంచినీటి ట్యాంకులు సక్రమంగా శుభ్రం చేయకపోవటంతో ఇబ్బందులు పడుతున్నాం. కలుషిత నీరు తాగటంతో రోగాల బారిన పడుతున్నాం. అధికారులు ట్యాంకుల పరిశుభ్రత గురించి పట్టించు కోవటం లేదు. తక్షణ చర్యలు తీసుకోవాలి.

రీసర్వేలో జరిగిన తప్పులను సరిచేయాలి

- శేషం వెంకటేశ్వర్లు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రీసర్వేలో జరిగిన తప్పులను సరిచేయాలి. తమకు హక్కుకల్గిన భూములను విడివిడిగా సబ్‌డివిజన్‌ చేయకుండా ఉమ్మడిగానే ఉంచారు.

తమ బిడ్డకు మెరుగైన వైద్యం అందించాలి

- రమాదేవి

తమ బిడ్డ దీర్ఘకాలిక వ్యాదితో బాధపడుతున్నాడు. నిరుపేదలమైన తాము ఎన్నోచోట్ల వైద్యం చేయించినప్పటికీ నయం కాలేదు. కార్పొరేట్‌ ఆస్పత్రిలో చూపించేందుకు స్థోమత లేదని వేడుకొంది. ఇంకా మరికొంతమంది భూ వివాదాలు, రోడ్లు, మురుగుకాల్వల సమస్యలను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, రాత్రంతా ఇక్కడే ఉంటామని కలెక్టర్‌ తెలిపారు. శనివారం ఉదయం కూడా గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్ష్యంగా చూస్తామని కలెక్టర్‌ రాజాబాబు పేర్కొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 12:21 AM