ఇబ్బందులను అధిగమించి ఇంటర్‌లో ప్రతిభ
ABN , Publish Date - Jun 30 , 2026 | 10:56 PM
జీవితంలో ఎదురైన తీవ్ర విషాదం ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయింది. వైవాహిక జీవితంలో ఇబ్బందులుపడినా నిరాశకు లోను కాకుండా తన చదువు కొనసాగించి ఈ ఏడాది ఇంటర్మీడియట్‌లో 990 మార్కులు సాధించి ప్రతిభ చాటింది కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు మండలంలోని రామాయపల్లికి చెందిన విద్యార్థిని కటికల భాగ్యశ్రీ
వివాహ జీవితంలో తీవ్ర విషాదం..
అయినా చదువుపై ఆమె పట్టు వీడలేదు
అత్యధిక మార్కులు సాధించిన హెచ్‌ఎంపాడు విద్యార్థిని
ప్రశంసించి ల్యాప్‌టాప్ బహూకరించిన మంత్రి లోకేష్
కనిగిరి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి) : జీవితంలో ఎదురైన తీవ్ర విషాదం ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయింది. వైవాహిక జీవితంలో ఇబ్బందులుపడినా నిరాశకు లోను కాకుండా తన చదువు కొనసాగించి ఈ ఏడాది ఇంటర్మీడియట్‌లో 990 మార్కులు సాధించి ప్రతిభ చాటింది కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు మండలంలోని రామాయపల్లికి చెందిన విద్యార్థిని కటికల భాగ్యశ్రీ. పదో తరగతి పూర్తయ్యాక 2019లో వివాహం.. ఆ తర్వాత భర్త చనిపోయినా ఆమె కుంగిపోలేదు. పరిస్థితులను దిగమింగుకుని ముందుకు సాగింది. చదువుపై ఉన్న ఇష్టంతో హెచ్‌ఎంపాడులోని కేజీబీవీలోని సీఎ్‌ససీ(కంప్యూటర్ సైన్స్)లో చేరింది. అసాధారణ పట్టుదలతో ఇంటర్ పరీక్షలు రాసి 990 మార్కులు సాధించింది. ఆమెకు విద్యపై ఉన్న నిబద్దతను గుర్తించిన ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో స్వయంగా మంత్రి లోకేష్ ఆ విద్యార్థిని భాగ్యశ్రీని అమరావతిలో ఘనంగా సత్కరించి ల్యాప్‌టాప్ అందచేసి అభినందించారు. కష్టాలను అవకాశాలుగా మలుచుకుంటూ సాధించిన ఈ విజయం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర కొనియాడారు.