మన.. ఘన.. ఒంగోలు...!
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:58 PM
ఒంగోలు నగరపాలక సంస్థ 150 ఏళ్ల పండుగకు సిద్ధమైంది. ఒంగోలు మునిసిపాలిటీగా ఏర్పడి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్దిన్నర ఉత్సవాలను నభూతో నభవిష్యతి అన్నట్లు యంత్రాంగం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఒంగోలుకు చెందిన కొన్ని ప్రత్యేకతలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం.
150 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న ఒంగోలు నగరపాలక సంస్థ
అనేక ప్రత్యేకతలు కలిగిన నగరం ఒంగోలు
ఎందరో సాహిత్య, సాంస్కృతిక ప్రముఖులకు నిలయం
ఒంగోలు కల్చరల్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరపాలక సంస్థ 150 ఏళ్ల పండుగకు సిద్ధమైంది. ఒంగోలు మునిసిపాలిటీగా ఏర్పడి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్దిన్నర ఉత్సవాలను నభూతో నభవిష్యతి అన్నట్లు యంత్రాంగం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఒంగోలుకు చెందిన కొన్ని ప్రత్యేకతలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం.
ఒంగోలు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది గిత్తలు. ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఒంగోలు గిత్తలు అమెరికా, హాలెండ్, మలేషియా, బ్రెజిల్, అర్జెంటీనా వంటి దేశాలకు ఎగుమతి అవుతాయి. మలేషియాలో ఒక ద్వీపానికి ఒంగోలు ద్వీపంగా పేరుపెట్టారంటేనే మన గిత్తల ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతోంది. 2002లో జరిగిన భారత జాతీయ పోటీల చిహ్నంగా కూడా ఒంగోలు గిత్త ఎంపికై ఒంగోలు కీర్తిని చాటింది.
ఒకప్పుడు ఒంగోలు ప్రాంతంలో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు లేవు. అటువంటి పరిస్థితులలో 1867లో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్‌కు చెందిన డాక్టర్ క్లౌవ్ దంపతులు ఒంగోలులో బాలికల పాఠశాలను స్థాపించి, 1892లో లోయర్ గ్రేడ్ ట్రైనింగ్ స్కూలును కూడా ప్రారంభించారు.
ప్రస్తుతం ఒంగోలుగా పిలుస్తున్న ఒంగోలు పేరు పూర్వకాలంలో ఊంగిప్రోలు అని, తర్వాత అది ఓగిప్రోలుగా మౌర్య, శాతవాహనుల కాలంలో రూపొందిందని చారిత్రక ఆధారాలున్నాయి. అనంతరం కాలంలో ఒంగోడుగా, వంగవోలుగా పిలువబడి, క్రీ.శ 13వ శతాబ్దం నుంచి ఒంగోలు పేరుతో స్థిరపడింది.
మందపాటి జమిందారీ వంశానికి చెందిన రఘుపతిరాజు కాలంలో ఒంగోలు కోట నిర్మించగా, తర్వాత రాజైన రామచంద్రరాజు కాలంలో ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం నిర్మించారు. అదేవిధంగా ఆయన దగ్గర మంత్రిగా ఉన్న వంకాయలపాటి వీరన్నచే ఆ పక్కనే కాశీ విశ్వేశ్వరాలయం నిర్మితమైంది.
ఒంగోలులో సీఎ్‌సఆర్ శర్మా కళాశాల. 1952 ఆగస్టు 1న తూర్పుపాలెం ఎలిమెంటరీ పాఠశాల ప్రాంగణంలో ప్రారంభమైన శర్మ కళాశాల తర్వాత కొంతకాలం గోశాలలో, అన్నమ్మ మిద్దెలో నడిచింది. అప్పట్లో ఇంటర్ వరకే ఉండేది. చివుకుల శ్రీరామశర్మ భూవిరాళంతో 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో స్వంత భవనాలతో ఇంటర్‌తో పాటు డిగ్రీ కళాశాల కూడా ప్రారంభించారు. ఆయన పేరుతో సీఎ్‌సఆర్ శర్మ కళాశాలగా నామకరణం జరిగింది. మాదాల రంగారావు, టి.కృష్ణ, ఎంవీఎస్ హరనాథరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి ఎంతోమంది సినీప్రముఖులు ఈ కళాశాల విద్యార్థులే.
ఒంగోలులో ఒకనాడు ఎంతోమంది వర్తకులకు వసతినిచ్చి నేడు ఆక్రమణలకు గురైన మరొక చారిత్రక ప్రదేశం అయ్యన్నశెట్టి సత్రం. దూరప్రాంతాల నుంచి వచ్చే వర్తకుల వసతి కోసం రైల్వేస్టేషన్‌కు సమీపంలో అయ్యన్నశెట్టి ఈ సత్రాన్ని కట్టించారు. వర్తకులకు నామమాత్ర రుసుంతో గదులను అద్దెకు ఇచ్చేవారు. అయ్యన్నశెట్టి తనకు చెందిన కొచ్చిన్ కేఫ్ బిల్డింగ్‌పై వచ్చే అద్దెను సత్రం నిర్వహణకు ఉపయోగించేవారు.
ఒంగోలులో వందేళ్ల చరిత్ర కలిగిన మరొక ప్రదేశం గోశాల. రాజాపానగల్‌రోడ్‌లోని జయరాం థియేటర్ పక్కన ఉన్న శ్రీ బాపూజీ గోశాల 1925లో స్థాపించబడింది. ప్రస్తుతం ఇందులో సుమారు 70 గోవులు ఉన్నాయి.
ఒంగోలులో ఒకనాడు తేజోవంతంగా వెలిగి నేడు కనుమరుగైన సాహిత్యవేదిక ‘ఎర్రన పీఠం’. ఐఏఎస్ అధికారి అయిన కనుములూరి వెంకటశివయ్య తనకున్న సాహిత్యాభిమానంతో, ఒంగోలుకు సమీపంలోని చదలవాడలో జన్మించిన కవి ఎర్రన పేరుతో ఈ సాహిత్యపీఠాన్ని ఒంగోలు ఆర్డీవో ఆఫీసు ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. ఏటా మూడు రోజులు ఈ పీఠం ఆధ్వర్యంలో జరిగే వార్షికోత్సవాలలో రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతోమంది కవులు పాల్గొనేవారు. ఆకొండి విశ్వనాధం, ధారా రామనాథశాస్ర్తిలు సంస్థను రిజిస్టర్ ఏర్పాటుచేసి కార్యవర్గాన్ని ఏర్పరిచారు. కొన్నేళ్లుగా ఈ ఎర్రన పీఠం మూతపడిపోవటం సాహిత్యవేత్తలను కలిచివేస్తుంది.
ఒంగోలులో తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన మరొక విశిష్ట ప్రదేశం ‘త్యాగరాజ మందిరం’ ఒకనాడు ఇది అనేకమంది సంగీత విద్వాంసులకు, సంగీత విద్యార్థులకు నిలయంగా ఉండేది. త్యాగరాజ స్వామికి ప్రధాన శిష్యులైన బందా కోటయ్య జీవితాంతం నాదోపాసన చేసి తన చరమాంకంలో బంధువులతో కలిసి శ్రీ త్యాగరాజ మందిరాన్ని ఏర్పాటుచేసి దానికి పాంచాలవరపు కామేశ్వర రావును ట్రస్టీగా నియమించారు. అనంతరం అనేక సంవత్సరాలు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు, కర్ణాటక సంగీత కచ్చేరీలు ఇక్కడ జరుగుతుండేవి.
ఫ ఒంగోలుకు చెందిన కొందరు మేధావులు భావితరాలను దృష్టిలో ఉంచుకుని మార్చి 21, 1891లో ఒక అద్దె భవనంలో సీవీఎన్ రీడింగ్ రూము ఏర్పాటు చేశారు. దీనికి నాడు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న దివాన్ బహదూర్ కామరాజు మన్నారు కృష్ణారావు పంతులు 1898వ సంవత్సరం మే నెలలో కొప్పరపు రామారావు పంతులుని కలిసి భవన నిర్మాణానికి ధనసహాయం కావాలని కోరటంతో ఆయన సంతోషంగా అంగీకరించారు. దీంతో స్థలం కోసం అప్పటి సబ్ కలెక్టర్‌ను అభ్యర్థించటంతో ఆయన ప్రస్తుతం సీవీఎన్ రీడింగ్ రూము ఉన్న స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలంలో కొప్పరపు రామారావు పంతులు రూ.2 వేల ఖర్చుతో ఒక పెంకుటిల్లును నిర్మించగా దానికి ఆయన తండ్రిగారైన కొప్పరపు వెంకన్న పేరుతో కొప్పరపు వెంకన్న నిలయం(సీవీఎన్) రీడింగ్ రూముగా 1900 సంవత్సరం ఏప్రిల్ 16న రూపుదిద్దుకుంది.