మన గిరిబాబు ఇకలేరు!
ABN , Publish Date - Nov 15 , 2026 | 02:36 AM
జిల్లాకు చెందిన ప్రముఖ సినీ నటుడు గిరిబాబు (83) ఇకలేరు. స్వగ్రామ మైన కొరిశపాడు మండలం రావినూతల ప్రజలతో నిత్యం కలిసి ఉండే ఆయన ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం 4 గంటలకు మృతి చెందారు.
అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు
ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూత
రావినూతలలో విషాదఛాయలు
స్వగ్రామంలో నేడు అంత్యక్రియలు
మేదరమెట్ల, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకు చెందిన ప్రముఖ సినీ నటుడు గిరిబాబు (83) ఇకలేరు. స్వగ్రామ మైన కొరిశపాడు మండలం రావినూతల ప్రజలతో నిత్యం కలిసి ఉండే ఆయన ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం 4 గంటలకు మృతి చెందారు. ఆయన లేరనే వార్త తెలియగానే జిల్లాలో విషాదఛాయలు అలముకున్నాయి. స్వగ్రామాన్ని అమితంగా ఇష్టపడే గిరిబాబు ఏమాత్రం ఖాళీ దొరికినారావినూతలకు వచ్చే వారు. ఆదివారం ఉదయం గిరిబాబు మృతదేహాన్ని సొంతూరికి తీసుకువస్తున్నట్లు బంధువులు తెలిపారు. మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు ఉంటాయని వారు చెప్పారు. గిరిబాబు మృతి పట్ల విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ స్వామి సంతాపం తెలిపారు. గిరిబాబుతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చెంచుగరటయ్య, ఆయన కుమారుడు కృష్ణచైతన్యలు గిరిబాబు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. 1978 నుంచి గిరిబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని గరటయ్య గుర్తు చేసుకున్నారు.
అసలు పేరు శేషగిరిరావు
1943 జూన్ 8న రావినూతలలో యర్ర నాగయ్య, నాగరత్నమ్మల ఏకైక సంతానంగా గిరిబాబు జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు యర్ర శేషగిరిరావు. సినీ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత గిరిబాబుగా పేరు మార్చుకున్నారు. తొలుత నాటక రంగంలో, తర్వాత సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. నాటితరం నటులు ఎన్‌టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్, చంద్రమోహన్ వంటి హేమహేమీలతోపాటు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ నటులతో కలిసి నటించారు. అలాగే నేటితరం హీరోలు మహేష్‌బాబు వంటి వారితోనూ కలిసి సూమారు 600పైగా సినిమాల్లో నటించిన ఘనత గిరిబాబుది. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు వైవిధ్యమైన పాత్రలను ఆయన పోషించారు.
గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర
రావినూతల గ్రామ అభివృద్ధిలో గిరిబాబు ముఖ్యపాత్ర పోషించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన జన్మభూమి కార్యక్రమాన్ని గ్రామ పెద్దలతో కలిసి సొంతూరులో సమగ్రంగా అమలు చేసి మంచిపేరు తెచ్చారు. సిమెంట్ రోడ్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం పలికారు. గ్రామాన్ని అన్ని విషయాల్లో ముందు ఉండేలా చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. గ్రామంలో దేవాలయాల పునర్‌నిర్మాణానికి తన మిత్రుడు దివంగత చప్పిడి హనుమంతరావు, గ్రామపెద్దలతో కలిసి తన వంతు తోడ్పాటును అందించారు.
క్రికెట్ అంటే ఇష్టం
క్రికెట్‌ను గిరిబాబు అమితంగా ఇష్టపడేవారు. సంక్రాంతి పండుగ స్పెషల్‌గా రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్ర క్రికెట్ పోటీలకు క్రమం తప్పకుండా ముఖ్య అతిథిగా హాజరయ్యేవారు. క్రికెట్ పోటీల ముగింపు వేడుకలకు పలువురు సినీతారలను బహుమతి ప్రదానోత్సవానికి తీసుకొచ్చారు. రావినూతలలో జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి తనవంతు కృషిచేశారు. ఎంపీలతో మాట్లాడి స్టేడియం నిర్మాణానికి నిధులు తెచ్చారు. గిరిబాబుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా కుమారులిద్దరూ సినీరంగంలోనే ఉన్నారు.