మా సంస్థ.. మా ఇష్టం
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:54 AM
‘విచారణపై స్టే వచ్చింది. మా న్యాయవాది ద్వారా ఆ సమాచారం అందింది. తీసుకురా వాలని బిజినెస్ మేనేజర్‌ను ఆదేశించాం. రెండు రోజులపాటు అతను అందుబాటులో ఉండడు. ఈదృష్ట్యా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా విచారణాధికారిని ఆదేశించండి’ అంటూ కోల్ సొసైటీ అధ్యక్షురాలు సహకారశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది.
కోల్ సొసైటీపై విచారణలో విచిత్రం
మా మేనేజర్ కోర్టుకు వెళ్తున్నారు.. చర్యలు లేకుండా ఆదేశించండి
సహకార శాఖ అధికారులకు ఒంగోలులోని సంస్థ అధ్యక్షురాలు లేఖ
చర్చనీయాంశంగా మారిన వ్యవహారం
నేడు పూర్తి రికార్డులు స్వాధీనం చేయాలని విచారణాధికారి ఆదేశం
‘విచారణపై స్టే వచ్చింది. మా న్యాయవాది ద్వారా ఆ సమాచారం అందింది. తీసుకురా వాలని బిజినెస్ మేనేజర్‌ను ఆదేశించాం. రెండు రోజులపాటు అతను అందుబాటులో ఉండడు. ఈదృష్ట్యా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా విచారణాధికారిని ఆదేశించండి’ అంటూ కోల్ సొసైటీ అధ్యక్షురాలు సహకారశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. దీనిపై ఆయా వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. సాధారణంగా విచారణలకు సంబంధించి అధికారులకు పాలకవర్గం లేదా ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నవారు ఎవ్వరైనా సహకరించి రికార్డులు స్వాధీనం చేయాలి. అవసరమైతే వారి ఎదుట హాజరుకావాలి. మరోవైపు నిర్దేశించిన గడువులోపు కోర్టుల ద్వారా వచ్చే ఉత్తర్వులు, ఉన్నతాధికారుల ఆదేశాలు తమకు అనుకూలంగా ఉంటే విచారణాధికారికి అందజేసి ఆ ప్రకారం ముందుకు సాగాలి. అయితే కోల్‌సొసైటీ వ్యవహారం అందుకు విరుద్ధంగా ఉంది.
ఒంగోలు, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు కేంద్రంగా నడుస్తున్న కోల్‌సొసైటీపై సహకారశాఖ ఉన్నతాధికారులు చేయిస్తున్న విచారణ ప్రక్రి యలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. విచార ణాధికారి కోరిన విధంగా నిర్దేశిత గడువైన ఈనెల 2వతేదీన సదరు సంస్థ బిజినెస్ మేనేజర్ పూర్తిస్థాయిలో రికార్డులు అందజేయకుండా పాక్షికంగా ఇచ్చారు. మిగిలిన వాటిని 4వతేదీన అందజేస్తానంటూ రాతపూర్వకంగా అభ్యర్థించిన విషయం విదితమే. అయితే ఆ రోజున కూడా రికార్డులు ఇచ్చే ఉద్దేశం కోల్ సొసైటీ పాలకవర్గా నికి లేదన్న విషయం మంగళవారం సహకారశాఖ అధికారులకు ఆ సంస్థ ప్రస్తుత అధ్యక్షురాలు తాటి పర్తి ఉదయలక్ష్మి రాసిన లేఖ ద్వారా స్పష్టమవు తోంది. దీన్ని బట్టి చూస్తే విచారణకు సహకరించేది లేదన్నట్లు వారి వ్యవహారం ఉందన్న విమర్శలు వస్తున్నాయి.
పెద్దల సంపూర్ణ సహకారం
అసలు కోల్‌సొసైటీకి సంబంధించిన పరిణామా లను పరిశీలిస్తే దానిపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోప ణల విషయంలో గతంలో జిల్లాలో పనిచేసిన సహ కారశాఖ వివిధ స్థాయిల్లోని అధికారులు, గతంలో పాలకపక్షంలో ఉన్న పెద్దల సంపూర్ణ సహకారం పాలక మండలికి ఉందన్నది నిర్వివాదాంశం. ప్రస్తుతం కూడా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న నాటి అధికారులు, గతంలోనూ, ఇప్పుడు పాలకపక్షంలో కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ ప్రజాప్రతినిధి అండ పుష్కలంగా పాలకమండలికి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కోల్‌సొసైటీపై కొందరు సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో సహకారశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించక తప్పలేదు. ఈక్రమంలో సహకారశాఖ ఒంగోలు అసిస్టెంట్ రిజిస్ట్రార్ నర్రా సురేంద్రబాబును విచారణాధికారిగా నియమించారు. రెండు నెలల్లో విచారణ పూర్తిచేసి నివేదించాలని గతనెల 19న ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం వారం రోజులకు కోల్‌సొసైటీ కార్యాలయానికి వెళ్లిన సురేంద్రబాబు ఈనెల 2న రికార్డులు అందజేయాలని సొసైటీ అధ్యక్షురాలు, బిజినెస్ మేనేజర్లకు నోటీసులు ఇచ్చారు.
ఆ రోజులలో అందుబాటులో ఉండడు..
రికార్డులను బుధవారం ఇవ్వాల్సిన బాధ్యత బిజినెస్ మేనేజర్‌పై ఉండగా మంగళవారం ప్రస్తుత అధ్యక్షురాలు ఉదయలక్ష్మి సహకారశాఖ అధికారులకు లేఖలు పంపారు. ‘విచారణాధికారికి రికార్డులు స్వాధీనం చేయాల్సిన 4వ తేదీ, మరుసటి రోజైన 5న బిజినెస్ మేనేజర్ తమ ఆదేశాల ప్రకారం హైకోర్టు పనిమీద వెళ్తున్నారు. ఆ రోజులలో అందుబాటులో ఉండరు. విచారణాధికారి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడండి’ అని ఆమె తన లేఖలో కోరారు. అయితే కోర్టు స్టే ఉత్తర్వులు ఉంటే నిర్దేశిత సమయంలోపు వాటిని తీసుకొచ్చి చూపించి విచారణ అపమని అడగాలి. అలాకాకుండా ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం ఉందని వాటిని తెచ్చేందుకు బిజినెస్ మేనేజర్ వెళ్తూ అందుబాటులో ఉండరు కనుక విచారణాధికారి బలవంతపు చర్యలు చేపట్టకుండా చూడాలని కోరడం సహకారశాఖ అధికారుల తీరుకు, ఆశాఖలో నెలకొన్న విచిత్ర పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.