Share News

ఒడా పునర్వ్యవస్థీకరణ

ABN , Publish Date - Aug 18 , 2026 | 02:29 AM

ఒంగోలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అఽథారిటీ (ఒడా) పునర్వ్య వస్థీకరణ జరిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని అన్ని పట్టణ, స్థానిక సంస్థలు, మండలాల పరిధిలో ఈ సంస్థ ఏర్పాటు కాగా, ప్రస్తుతం మారిన జిల్లాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేశారు.

ఒడా పునర్వ్యవస్థీకరణ
ఒంగోలులోని ఒడా కార్యాలయం

గతంలో ఉన్న ఐదు పట్టణాలు, 29 మండలాలు తొలగింపు

ప్రస్తుత జిల్లాలోని ఐదు పట్టణాలు, 28 మండలాలతో కొత్త సంస్థ

తాజాగా కందుకూరు మునిసిపాలిటీ...

ఆ నియోజకవర్గంలోని ఐదు మండలాలు చేర్పు

మొత్తం 514 రెవెన్యూ గ్రామాల

పరిధిలో 6,372.17 కి.మీ విస్తీర్ణం

కొత్తగా మార్కాపురం అర్బన్‌ సంస్థ ఏర్పాటు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఒంగోలు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అఽథారిటీ (ఒడా) పునర్వ్య వస్థీకరణ జరిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని అన్ని పట్టణ, స్థానిక సంస్థలు, మండలాల పరిధిలో ఈ సంస్థ ఏర్పాటు కాగా, ప్రస్తుతం మారిన జిల్లాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేశారు. ఈ క్రమంలో కొత్తగా మార్కాపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కూడా ఏర్పాటైంది. గతంలో ఒడా ఏర్పాటైనప్పుడు తొలుత ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో ఉన్న మునిసిపాలిటీలు, మండలాలతోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండ ప్రాంతాన్ని కూడా దాని పరిధిలో చేర్చారు. అనంతరం కొంత కాలానికి వినుకొండ ప్రాంతంతోపాటు ఉమ్మడి జిల్లాలోని కందుకూరు ప్రాంతాన్ని తొలగించారు. మిగిలిన ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని అన్నిప్రాంతాలూ ఒడాలోనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లా విభజన అనంతరం కూడా అలాగే కొనసాగుతూ వస్తోంది. ఒంగోలు కేంద్రంగానే ఆయా ప్రాంతాల కార్యకలాపాలు ఒడా ద్వారా సాగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని పలు పట్టణాభివృద్ధి సంస్థల్లో మార్పులు, చేర్పులు చేసింది. తదనుగుణంగా సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.

కొత్తగా కందుకూరు చేరిక

ప్రస్తుత ప్రకాశం జిల్లా పరిధిలోని ఒంగోలు కార్పొరేషన్‌, అద్దంకి, కందుకూరు, చీమకుర్తి, దర్శి మునిసిపాలిటీలతోపాటు జిల్లాలోని 28 మండలాలు ఒడా పరిధిలోకి వచ్చాయి. ఇందులో ఒంగోలు నియోజకవర్గంలో మూడు, సంతనూతలపాడులో నాలుగు, కొండపిలో ఆరు, అద్దంకిలోని ఐదు, దర్శిలోని ఐదుతోపాటు కందుకూరులోని ఐదు మండలాలు ఉన్నాయి. వీటిలో కందుకూరు మునిసిపాలిటీ, ఆ నియోజకవర్గంలోని ఐదు మండలాలు కొత్తగా చేర్చగా మిగిలినవన్నీ గతంలో కూడా ఉన్నాయి.

మార్కాపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు

ఇప్పటివరకు ఒడా పరిధిలో ఉన్న ప్రస్తుత మార్కాపురం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు. కనిగిరి, పొదిలి మునిసిపాలిటీలు, ఆ జిల్లాలోని 21 మండలాలతో 507 గ్రామాలతో కొత్తగా మార్కాపురం పట్టణాభివృద్ధి సంస్థ (ముడా) ఏర్పాటైంది. ముడా ద్వారా ప్రత్యేక నిధులు విడుదల కానున్నాయి. అలాగే ఇప్పటి వరకు ఒడా పరిధిలో ఉన్న చీరాల మునిసిపాలిటీ, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లోని 8 మండలాలను తొలగించారు. వాటిని బాపట్ల పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి చేర్చారు. కాగా తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఐదు పట్టణ స్థానిక సంస్థలు, 28 మండలాలకు ఒడా పరిమితమైంది. ఈ పరిధిలో మొత్తం 514 రెవెన్యూ గ్రామాలు ఉండగా 637.17కి.మీ విస్తీర్ణంగా ప్రభుత్వం గుర్తించింది. ఆ మేరకు మండలాల వారీ రెవెన్యూ గ్రామాలు, విస్తీర్ణం వివరాలపై ప్రభుత్వం సోమవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది.

Updated Date - Aug 18 , 2026 | 02:29 AM