ఉద్యోగుల విభజనకు ఉత్తర్వులు జారీ
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:20 AM
రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు విభజిత జిల్లాలకు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను పునర్వ్యవస్థీకరించిన నూతన స్థానిక కేడర్లకు తుది కేటాయింపుపై ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
పాత మార్గదర్శకాల ప్రకారమే కేటాయింపులు
ఒంగోలు విద్య, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు విభజిత జిల్లాలకు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను పునర్వ్యవస్థీకరించిన నూతన స్థానిక కేడర్లకు తుది కేటాయింపుపై ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు అక్టోబరు 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతాఽధికారులతో నిర్వహించిన సమావేశంలో సీనియారిటీ ప్రాతిపదికనే ఉద్యోగుల కేటాయింపు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. స్థానిక కేడర్లలో సీనియర్, జూనియర్ ఉద్యోగులు ఇద్దరికీ ప్రాతినిథ్యం ఉండేలా కేటాయింపులు ఉండాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ప్రక్రియ చేయనున్నారు. విభజిత జిల్లాలకు పునర్వ్యవస్థీకరించిన స్థానిక కేడర్లకు ఉద్యోగుల కేటాయింపులో ప్రాధాన్యం కేటగిరీలకు తొలుత కేటాయింపులు చేపడతారు. 70శాతం లేదా అంతకంటే ఎక్కువ బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న ఉద్యోగులు, మానసిక వైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు, భర్త మరణించిన అనంతరం పునర్ వివాహం చేసుకున్న మహిళా ఉద్యోగులు, నిర్ధిష్ట తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులకు కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తారు. ఉద్యోగుల స్థాయిని బట్టి జిల్లా, జోన్లు, మల్టీ జోన్లకు సంబంధించి కేడర్ వారిని కేటాయిస్తారు. ప్రాధాన్యత కేటగిరీల ఉద్యోగుల కేటాయింపులు పూర్తయిన తర్వాత మిగిలిన వారిని వారి సీనియారిటీ, వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా సంబంధిత స్థానిక కేడర్లలో అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా కేటాయింపులు చేపడతారు. ఉద్యోగులను వయస్సు, సీనియారిటీ ఆధారంగా వేర్వేరు గ్రూపులుగా విభజించడం వల్ల కొందరు సీనియర్ ఉద్యోగులకు తక్కువ ప్రాధాన్యతగల స్థానిక కేడర్లు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, శాఖధిపతుల్లో జిల్లా కలెక్టర్లు, సంబంధిత అమలు కమిటీల అధికారులు తక్షణ చర్యలు తీసుకోనున్నారు. ఉద్యోగుల తుది కేటాయింపు ప్రక్రియను నిర్దేశిత గడువులోపు పూర్తిచేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.