తొలిరోజు రెండే!
ABN , Publish Date - Oct 17 , 2026 | 02:25 AM
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లలో తొలిరోజైన శుక్రవారం అభ్యర్థుల నుంచి పెద్దగా స్పందన కనిపించ లేదు. జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు అద్దంకి, దర్శి, చీమకుర్తి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే.
చీమకుర్తిలో చైర్మన్ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్
ఒంగోలు కార్పొరేషన్‌లోని ఒకటో డివిజన్‌కు ఒకరు దాఖలు
ఇతర అర్బన్ సంస్థల్లో నిల్.. నేడు భారీగా సమర్పించే అవకాశం
అభ్యర్థిత్వాల కోసం కూటమి శ్రేణుల నుంచి నేతలపై ఒత్తిడి
ఒంగోలు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లలో తొలిరోజైన శుక్రవారం అభ్యర్థుల నుంచి పెద్దగా స్పందన కనిపించ లేదు. జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు అద్దంకి, దర్శి, చీమకుర్తి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. ఒంగోలులో మేయర్, 62 మంది కార్పొరేటర్లు... అలాగే మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలతోపాటు మొత్తం 88 వార్డు కౌన్సిలర్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు కేవలం మూడు రోజులు మాత్రమే నామినేషన్ల దాఖలుకు ఎన్నికల కమిషన్ సమయం ఇచ్చింది. అందులో తొలిరోజైన శుక్రవారం ఆయా అర్బన్ స్థానిక సంస్థల్లో రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణకు సిద్ధమయ్యారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లకు సమయం ఉండగా సంబంధిత సిబ్బంది తమ కార్యాలయాల్లోనే ఉన్నారు. అయితే చీమకుర్తిలో మున్సిపల్ చైర్మన్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున తమ్మల సుబ్బారావు, ఒంగోలులో ఒకటో డివిజన్‌కు నావూరి కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఇతర అర్బన్ సంస్థల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
నేడు భారీగా వచ్చే అవకాశం
ఇక రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో రెండో రోజైన శనివారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తు న్నాయి. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో పదవుల కోసం గట్టిపోటీ ఉంటుంది. అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోయినా వాటిని ఆశిస్తున్న వారు ముందుగా నామినేషన్లు వేసి అనంతరం తమకు సీటు దక్కకపోతే ఉపసంహరణ చేస్తుంటారు. అయితే ఈసారి ఎన్నికల్లో కూటమి పార్టీల విజయం ఖాయమన్న ఽభావన ప్రజలు, రాజకీయవర్గాల్లో ఉంది. దీంతో కూటమి పార్టీల తరఫున అభ్యర్థిత్వాలు ఆశిస్తున్న వారు భారీగానే ఉన్నప్పటికీ సీటు ఖాయం అన్న సంకేతాలు వచ్చాక నామినేషన్ వేద్దామన్న ధోరణిలో ఉన్నారు. తమకు అవకాశం కల్పించాలని స్థానిక ఎమ్మెల్యేలు, కీలక నేతలపై ఒత్తిడి తెస్తూ తొలిరోజు నామినేషన్లకు అంతగా ఆసక్తి చూపలేదు. ఇక ప్రఽధాన ప్రతిపక్షమైన వైసీపీ తరఫున పోటీకి స్థానిక నేతలు అంతగా ముందుకు రావడం లేదు. దీంతో అభ్యర్థుల కోసం ఆ పార్టీ నేతలు గాలిస్తుండటంతో వారి వైపు నుంచి కూడా నామినేషన్లు దాఖలు కాలేదు.
ఒంగోలులోని టీడీపీ కార్యాలయం వద్ద రద్దీ
డివిజన్ కార్పొరేటర్ పదవులు ఆశిస్తున్న ఆశావహులతో ఒంగోలులోని టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం రద్దీ వాతావరణం కనిపించింది. ఈ ఎన్నికలను పర్యవేక్షిస్తున్న దామచర్ల జనార్దన్.. కార్యాలయంలో ఉండి ఆయా డివిజన్ల నుంచి పెద్దఎత్తున వస్తున్న పార్టీ శ్రేణులతో మాట్లాడటం కనిపించింది. అలాగే ఆయా డివిజన్ల వారీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల క్యాంపెయిన్, పోలింగ్ వరకు పార్టీపరంగా ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి వారికి ఎమ్మెల్యే జనార్దన్ దిశానిర్దేశం చేశారు. మరోవైపు నగరంలోని 62 డివిజన్లలో సుమారు 20శాతం వరకు కూటమి భాగస్వామ్యపక్షాలైన జనసేన, బీజేపీకి ఇవ్వాల్సి ఉండటంతో సంబంధిత నాయకులతో కూడా ఆ విషయమై జనార్దన్ చర్చించినట్లు సమాచారం.
కసరత్తులో నేతలు
ఇతర మునిసిపాలిటీల్లోనూ అక్కడి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలు పోటీ చేసే అభ్యర్థుల విషయమై కసరత్తులో నిమగ్నమయ్యారు. ఇదిలాఉండగా నామినేషన్ల ప్రక్రియ ఆరంభమవడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఎన్నికలు జరుగుతున్న పట్టణాల్లో మేయర్, చైర్మన్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసే మున్సిపల్ కార్యాలయాలతోపాటు వార్డులకు నామినేషన్ల కోసం ఏర్పాటు చేసిన ఇతర కేంద్రాల వద్ద భారీ బందోస్తును ఏర్పాటు చేశారు. ఆయా సెంటర్లకు వచ్చే రోడ్లలో 100 మీటర్లకు అవతలే ట్రాఫిక్ మళ్లించడం, అలాగే దగ్గరకు రాకుండా వాహనాలను నిలిపివేయడం చేస్తున్నారు. అభ్యర్థులను, వారికి మద్దతుదారులు ఇద్దరిని మాత్రమే ఆయా కేంద్రాల్లోకి అనుమతించేలా బందోబస్తును ఏర్పాటు చేశారు