ఇక రెండు వారాలే..
ABN , Publish Date - Mar 04 , 2026 | 02:51 AM
పట్టణ స్థానిక సంస్థల పాలక మండళ్ల పదవీకాలం ముగింపు దశకు చేరింది. రాష్ట్రంలో నగర పాలక సంస్థలు, మునిసిపల్, నగర పంచాయతీ కౌన్సిళ్ల పదవీ కాలం ఈనెల 17తో ముగియనుంది.
17తో ముగియనున్న పట్టణ సంస్థల పాలకవర్గాల పదవీకాలం
ఆ తర్వాత అంతా మాజీలే
అత్యధికులు వైసీపీకి చెందిన వారే
స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే
అధికారుల పాలనలోకి పట్టణాలు
ఒంగోలు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : పట్టణ స్థానిక సంస్థల పాలక మండళ్ల పదవీకాలం ముగింపు దశకు చేరింది. రాష్ట్రంలో నగర పాలక సంస్థలు, మునిసిపల్, నగర పంచాయతీ కౌన్సిళ్ల పదవీ కాలం ఈనెల 17తో ముగియనుంది. తదనుగుణంగా ఉమ్మడి జిల్లాలోని దర్శి నగరపంచాయతీ మినహా మిగతా సంస్థల పాలక మండళ్ల గడువు కూడా ఆ రోజుతో ముగియనుంది. ప్రస్తుతం ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, చైర్మన్ హోదాల్లో ఉన్న వారంతా మాజీలు కానున్నారు. అప్పట్లో ధన, అధికార బలం చూపి అత్యధికంగా వైసీపీ వారే గెలుపొందారు. వారందరి పదవులు పోనున్నాయి. రాష్ట్రంలో 2021 మార్చి 10న మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. అప్పటికి జిల్లాల పునర్విభజన జరగలేదు.
కందుకూరు, పొదిలి మినహా..
పూర్వపు జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు చీరాల, మార్కాపురం మునిసిపాలిటీలు, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మునిసిపాలిటీగా ఉన్న కందుకూ రులో కోర్టు కేసు కారణంతో నిలిచిపోయాయి. అనం తరం కొంతకాలానికి దర్శి, పొదిలి నగర పంచాయతీలు ఏర్పాటయ్యాయి. దర్శికి కొంతకాలానికి ఎన్నికలు జరి గాయి. కందుకూరు, పొదిలికి మాత్రం నిర్వహించలేదు. ఈ సంస్థల పాలక మండళ్ల పదవీకాలం ఐదేళ్లు కాగా ఒంగోలు కార్పొరేషన్, చీరాల, మార్కాపురం మునిసిపాలిటీలు, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు నగరపంచాయతీల పాలకమండళ్ల పదవీకాలం ఈనెల 17తో ముగిసిపోనుంది.
ఎన్నికల ఊసే కరువు
గడువు ముగిసిన తర్వాత ఆయా సంస్థల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా, చైర్మన్‌గా ఉన్న వారంతా మాజీలుగా మారనున్నారు. కాగా వారి పదవీకాలం ముగిసేలోపుగానే సాధారణంగా ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు వస్తాయి. అయితే అలాంటి ఎన్నికల ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఇక రెండు వారాల్లోనే వారి పదవీ కాలం ముగియనున్న ఇంతవరకు ఎన్నికల కసరత్తు మొదలు కాకపోవడాన్ని బట్టి చూస్తే ఇప్పట్లో వాటికి ఎన్నికలు జరగవన్న విషయం స్పష్టమవుతోంది. దీంతో పాలకవర్గాల గడువు ముగిసిన వెంటనే అధికారుల పాలనలోకి పట్టణ స్థానిక సంస్థలు వెళ్లనున్నాయి. ఒంగోలు కార్పొరేషన్‌కు ఐఏఎస్ అధికారి ఇతర వాటికి డిప్యూటీ కలెక్టర్ల స్థాయి అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా నియమితులై వారి పర్యవే క్షణలో కార్యకలాపాలు సాగుతాయి. తద్వారా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేల అజమాయిషీ వాటిపై మరింత పెరగనుంది.