Share News

శతాబ్దిన్నర ఉత్సవాలకు ఒంగోలు ముస్తాబు

ABN , Publish Date - Sep 26 , 2026 | 11:48 PM

ఒంగోలు మునిసిపాలిటీ శతాబ్దిన్నర ఉత్సవాలకు నగరం ముస్తాబవుతోంది. యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాలను మూడు రోజులపాటు నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ వివిధ కారణాలతో ఈనెల 30న ఒక్క రోజే నిర్వహించాలని నిర్ణయించారు.

శతాబ్దిన్నర ఉత్సవాలకు   ఒంగోలు ముస్తాబు
విద్యుత్‌ దీపాలంకరణతో మెరిసిపోతున్న ఒంగోలు నగరం

నగరం అంతటా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు

పలుచోట్ల విద్యుత్‌ దీపాలతో అలంకరణ

మినీస్టేడియంలో భారీ ఏర్పాట్లు

నేడు హెరిటేజ్‌ వాక్‌.. మూడువేల మందికిపైగా పాల్గొనే అవకాశం

ఏర్పాట్లపై మునిసిపల్‌ అధికారులతో ఎమ్మెల్యే జనార్దన్‌ సమీక్ష

ఒంగోలు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు మునిసిపాలిటీ శతాబ్దిన్నర ఉత్సవాలకు నగరం ముస్తాబవుతోంది. యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాలను మూడు రోజులపాటు నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ వివిధ కారణాలతో ఈనెల 30న ఒక్క రోజే నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ నేతృత్వంలో మునిసిపల్‌ అధికారులు, టీడీపీ శ్రేణులు కార్యక్రమ విజయవంతానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో 150 ఏళ్ల ఉత్సవాలకు సంబంధించిన హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. పలుచోట్ల ప్రధాన కూడళ్లు, డివైడర్లను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. మరోవైపు మొత్తం కార్యక్రమం 30వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు మినీ స్టేడియంలో జరగనుండగా అక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా వేలాది మంది కూర్చొని కార్యక్రమంలో పాల్గొనేలా షెడ్లు నిర్మిస్తున్నారు. దాదాపు 150 మంది కూర్చునేలా భారీ సభా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ఒడిసా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు, అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడితో సహా పలువురు రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. దీంతో వారి పేర్లతో ఆహ్వాన పత్రాలను కూడా ముద్రించారు. కళారూపాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు, ఒంగోలు జాతి ఎద్దుల ప్రత్యేక ప్రదర్శనకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం నగరంలో హెరిటేజ్‌ వాక్‌ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, యువకులు, విభిన్న వర్గాలకు చెందిన దాదాపు మూడువేల మందికిపైగా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. స్థానిక మంగమూరు రోడ్డు జంక్షన్‌ నుంచి లాయర్‌పేట, సాయిబాబా గుడి, కోర్టు సెంటర్‌, మునిసిపల్‌ కార్యాలయం మీదుగా చర్చిసెంటర్‌ వరకు ఈ వాక్‌ సాగనుంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు జనార్దన్‌, బీఎన్‌ విజయ్‌కుమార్‌, కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తదితరులు భాగస్వామ్యం కానున్నారు. ఇదిలా ఉండగా ఉత్సవాలకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఏర్పాట్లపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మరింత దృష్టి సారించారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతో శనివారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంఽధించి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

Updated Date - Sep 26 , 2026 | 11:48 PM