శరవేగంగా ఒంగోలు నగర అభివృద్ధి
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:32 PM
ఒంగోలు నగర అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. మంగళవారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన పాలకవర్గసమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు
ఆర్టీసీ డిపో మార్పుకు అవసరమైన చర్యలు
ప్రతి డివిజన్‌లోనూ కమ్యూనిటీ హాలు నిర్మాణం
ఎమ్మెల్యే దామచర్ల వెల్లడి
ఒంగోలు కార్పొరేషన్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగర అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. మంగళవారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన పాలకవర్గసమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు రాజీ లేకుండా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు. ఇప్పటికే అవసరమైన ప్రాంతాల్లో రోడ్లు, కాలువలు, కల్వర్టులు నిర్మించామని, అమృత్ 2.0 కింద గుండ్లకమ్మ, రామతీర్థం నుంచి నీరు దిగుమతి చేసుకుని నగర ప్రజలకు ప్రతి రోజూ తాగునీరు అందించేందుకు చర్యలుచేపట్టినట్లు తెలిపారు. చింతల, కొప్పోలు వద్ద టిడ్కో ఇళ్ల పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే లబ్ధిదారులకు కేటాయిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఒంగోలు ఆర్టీసీ డిపోను త్రోవగుంట సమీపంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్దకు గాని, ఆ సమీపంలోని ఐటీఐ కాలేజీ వద్దకు మార్చేందుకు ఆర్టీసీ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే ప్రతి డివిజన్‌లోనూ కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని, తద్వారా చిన్నచిన్న ఫంక్షన్‌లు చేసుకోవచ్చని తెలిపారు. అంతకుముందు గుర్రం జాషువా కాలనీలో రూ.15లక్షలతో నిర్మించిన కల్వర్టు, క్వారీ రబ్బీష్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దామచర్ల శిలాఫలకం ఆవిష్కరించారు.