ఒంగోలు సంబరం
ABN , Publish Date - Sep 29 , 2026 | 01:02 AM
ఒంగోలు ఉత్సవానికి నగరం సిద్ధమవుతోంది. ఈనెల 30న శతాబ్దిన్నర వేడుక జరగనుండగా వారంరోజుల నుంచి నగరంలో అలంకరణ, కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
వేడుకలకు సిద్ధమవుతున్న నగరం
రేపు శతాబ్దిన్నర ఉత్సవాలు
మినీ స్టేడియం వేదికగా రోజంతా నిర్విరామంగా కార్యక్రమాలు
సభలు, సాంస్కృతిక, పుస్తక, ఫొటో ప్రదర్శనలు, ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు
విశాలమైన సభావేదిక
రెండున్నర వేలమంది కూర్చునేలా ప్రాంగణం
హాజరవుతున్న వెంకయ్యనాయుడు, కంభంపాటి, అయ్యన్న, మంత్రులు
ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానాలు
ఎమ్మెల్యే జనార్దన్ నేతృత్వంలో భారీ ఏర్పాట్లు
ఒంగోలు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు ఉత్సవానికి నగరం సిద్ధమవుతోంది. ఈనెల 30న శతాబ్దిన్నర వేడుక జరగనుండగా వారంరోజుల నుంచి నగరంలో అలంకరణ, కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మినీస్టేడియం వేదికగా ప్రధాన కార్యక్రమం జరగనుంది. ఆ ప్రాంగణాన్ని సిద్ధం చేయడంతోపాటు నగర సుందరీకరణ వేగంగా సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రత్యక్ష పర్యవేక్షణ, కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశాలకు అనుగుణంగా కార్పొరేషన్ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శతాబ్ది న్నర వేడుకలకు ఒంగోలు నగరం సిద్ధమవుతోంది. తొలుత మూడు రోజులపాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని షెడ్యూల్ రూపొందించినప్పటికీ వాతావరణంలో మార్పులతో 30వతేదీ ఒక్కరోజుకే పరిమితం చేశారు. దీంతో మొత్తం కార్యక్రమాలు ఒకే రోజు నిర్వహించాల్సి వచ్చి బిజీ షెడ్యూలైంది. ఉద యం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా కార్యక్రమాలు కొనసాగేలా చర్యలు చేపట్టారు. శతాబ్ది న్నర వేడుకల సభలతోపాటు సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రముఖులకు సన్మానాలు, పుస్తక, ఫొటో ప్రదర్శనలు, ఆర్ట్ గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఒంగోలు గిత్తల ప్రదర్శన నగరంలోని ప్రధాన వీధులలో సాగనుండగా మిగిలిన కార్యక్రమం అంతా మినీ స్టేడియంలోనే జరగనుంది. దాదాపు 150మంది కూర్చునేలా భారీ వేదిక, దానిపైన సాంస్కృతిక, కళాప్రదర్శనలు నిర్వహించనున్నారు. సుమారు రెండున్నర వేలమంది కూర్చుని కార్యక్రమాలను తిలకించేలా భారీ సభా ప్రాంగణాన్ని వర్షం వచ్చినా ఇబ్బంది కలగకుండా షెడ్ రూపంలో నిర్మిస్తున్నారు. ఆ ప్రాంగణం వెలుపల పుస్తక, ఫొటో ప్రదర్శనలు అలాగే ఆర్ట్ గ్యాలరీల ఏర్పాటుతోపాటు మధ్యాహ్నం, రాత్రి ఆ కార్యక్రమా లకు వచ్చేవారికి భోజనాలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
నగరం అంతా అలంకరణ
శతాబ్దిన్నర ఉత్సవాల గురించి ప్రజలందరికీ తెలి సేలా మరోవైపు నగరం అంతటా పెద్దఎత్తున వివిధ రూపాలలో అలంకరణలు చేశారు. ఇదిలా ఉండగా 30వ తేదీన రెండు విభాగాలుగా వేడుకలు సాగేలా షెడ్యూల్‌ను రూపొందించారు. ఉదయం సాంస్కృతిక ప్రదర్శనలతో కార్యక్రమం ప్రారంభంకానుంది. ఆ సందర్భంగా జరిగే సభలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, జిల్లావాసి అయిన ఒరిస్సా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబులు ముఖ్యఅతిఽథులుగా పాల్గొననుండగా సాయంత్రం జరిగే సభలో శాసనసభా స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు పాల్గొననున్నారు. అలాగే జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా మంత్రులు డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌లు రెండుపూటలా కార్యక్రమంలో పాల్గొననున్నారు. మునిసిపల్ మంత్రి పొంగూరు నారాయణతోపాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బి.సి.జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారధిలు, టీడీపీ పార్లమెంటరీపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ పలువురు వివిధ ప్రాంతాలకు చెందిన, అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అనేకమంది రెండుపూటలా ఏదో ఒక సమావేశంలో పాల్గొనేలా కార్యక్రమం రూపొందించారు.
ఒంగోలు గిత్తల అందాల పోటీ
ఉమ్మడి జిల్లా నుంచి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా, అలాగే ప్రభుత్వ పదవులలో ఉన్న ముఖ్యనేతలు అందరికీ ఈ వేడుకలలో పాల్గొనాలని ఆహ్వానాలు పంపించారు. మొత్తం 150 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు సన్మానాలు చేయనున్నారు. మొత్తం కార్యక్రమాలు మినీస్టేడియం ప్రాంగణంలో జరగనుండగా నగర ప్రజలంతా తిలకించేలా ఒంగోలు జాతి గిత్తల ర్యాలీని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 70 జతల ఒంగోలు జాతిగిత్తలు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నాయి. సాయంత్రం 4 గంటలకు మినీ స్టేడియం నుంచి ప్రారంభమయ్యే గిత్తల ప్రదర్శన నెల్లూరు బస్టాండ్, కలెక్టరేట్, ట్రంక్‌రోడ్డు మీదుగా అద్దంకి బస్టాండ్‌లోని ఎన్టీఆర్ సర్కిల్ వరకు సాగనుంది. ఒంగోలుకు కీర్తిప్రతిష్టలు తెచ్చిన గిత్తల ప్రదర్శనతోపాటు వాటి అందాల పోటీలు కూడా నిర్వహించి వివిధ విభాగాలలో భారీగా బహుమతులను ఇవ్వనున్నారు. మినీస్టేడియంలో జరగనున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నగర ప్రజానీకం అంతా వేడుకలలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.